రాష్ట్రపతికి ట్రిపుల్ బొనాంజా!

దీపావళి పర్వదినం సందర్భంగా ఎక్కడైనా పండగ ఆఫర్ల కింద డబుల్ బొనాంజాలు కూడా దక్కుతూ ఉండవచ్చు గానీ.. భారత రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి మాత్రం ట్రిపుల్ బొనాంజా దక్కుతోంది. వారి వేతనాలు ఒకేసారి మూడింతలు పెరగబోతున్నాయి. ఒక రకంగా చూస్తే ఇప్పటిదాకా వారు అందుకుంటున్న వేతనాలు చాలా తక్కువ కింద లెక్క. పైగా ప్రభుత్వోద్యోగుల్లో గరిష్ట జీతాలు కూడా రాష్ట్రపతి జీతం కంటె మించి పోయిన నేపథ్యంలో.. కేంద్ర హోం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి... వీరిద్దరి వేతనాలు పెంచబోతున్నది.
రాష్ట్రపతి కి ప్రస్తుతం 1.5 లక్షల జీతం లభిస్తోంది. 2008 తర్వాత ఈ పదవులకు వేతనాలు పెరగలేదు. ప్రస్తుతం ఏడో వేతన సంఘం సిఫారసుల తర్వాత కేబినెట్ కార్యదర్శికి 2.5 లక్షలు, కేంద్ర కార్యదర్శికి 2.25 లక్షల వేతనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వేతనాన్ని కూడా సవరించాలని హోం శాఖ ప్రతిపాదిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రపతికి 1.5 లక్షలు, ఉప రాష్ట్రపతికి 1.25 లక్షలు, గవర్నరుకు 1.10 లక్షలు జీతాలు ఉన్నాయి. వీటన్నిటినీ సవరిస్తారు. మాజీలుగా ఉన్న వారి పింఛన్లను కూడా సవరిస్తారు.
రాష్ట్రాలు ఒకవైపు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇచ్చే వేతనాలను తమంతగా తాము తీర్మానాలు పెట్టుకుని ఎడా పెడా ఆమోదించేసుకుంటున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యేల వేతనాలు సుమారు నెలసరి 3.5 లక్షల వరకు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రపతికి ఇన్నాళ్లకు సవరించిన వేతనాలు మాత్రం ఇంకా కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.

