రాయపాటి ఎందుకు అలిగారు?

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గుంటూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఆయన పెద్దగా పాల్గొనడం లేదు. తనకు ముఖ్యమైన వారు పిలిస్తే తప్ప ఇతర కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. టీడీపీ సర్కార్ పై అసంతృప్తితోనే రాయపాటి రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. తాను ఆశించిన టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వకపోవడంతో రాయపాటి గతంలోనే కినుక వహించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి కమ్మ సామాజిక వర్గానికి ఈ పరిపాలనలో పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని కూడా ఆయన ఆ సామాజిక వర్గం సమావేశంలో వ్యాఖ్యానించారు. అయినా టీటీడీ ఛైర్మన్ పదవి రాయపాటికి ఇవ్వనని చంద్రబాబు తేల్చి చెప్పారు.
కార్యక్రమాలకు దూరంగా....
టీటీడీ ఛైర్మన్ పదవి రాకపోవడంతో పాటు ఇటీవల పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు నుంచి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని తప్పించడం కూడా రాయపాటి అలకకు కారణమైంది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని 16 సి కింద నిబంధన నుంచి ఎందుకు కాంట్రాక్ట్ నుంచి తొలగించకూడదని ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. ఈ కాంట్రాక్టును రాయపాటి కాంగ్రెస్ హయాంలోనే పొందారు. అయితే పనుల్లో నత్తనడక నడుస్తుండటంతో ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేసే చంద్రబాబు రాయపాటి కంపెనీని తప్పించారు. పోలవరం ప్రాజెక్టునుంచి 2018 నాటికి నీరివ్వాలన్న సీఎం లక్ష్యాన్ని ఆ కంపెనీ నెరవేర్చలేక పోయింది. దీంతో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని కాంట్రాక్ట్ నుంచి తప్పించారు. దీంతో రాయపాటి ఢిల్లీలోనే మకాం వేసి చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా కొన్ని ఆధారాలు కేంద్రానికి సమర్పించినట్లు తెలిసింది. పట్టిసీమ, పురుషోత్తంపట్నం ప్రాజెక్టుల లోగుట్టును కూడా రాయపాటి కమలం నేతలకు పూసగుచ్చినట్లు వివరించినట్లు టీడీపీ పెద్దలకు కూడా తెలిసింది. దీంతో చంద్రబాబు కూడా రాయపాటి వ్యవహారశైలిపై అంతర్గత సమావేశంలో మండిపడినట్లు సమాచారం. అందుకే రాయపాటి గత కొద్ది రోజులుగా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
- Tags
- రాయపాటి

