రాజధానిలో పేదల ఇళ్లు ఇలా ఉంటాయా?

ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు సీఎం చంద్రబాబు. విదేశీ రాజధానులు సైతం తలదన్నేలా ఇక్కడి నిర్మా ణాలు ఉండాలని ఆయన అనుక్షణం తపిస్తున్నారు. 2030 నాటికి ప్రపంచ రాజధానుల్లో ఏపీ తొలి పది స్థానాల్లో ఒకటిగా నిలుస్తుందని కూడా ఆయన అంటున్నారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లను కూడా బాబు సిద్ధం చేసుకున్నారు. ఇక, రాజధానిలో భూములు ఇచ్చిన పేదలకు ఇక్కడే పక్కా భవనాలు నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు సంకల్పించారు.
అత్యాధునిక వసతులతో....
అయితే, ఇప్పుడు ఆ రేంజ్లో ఇళ్లు కట్టి ఇచ్చే కెపాసిటీ ప్రభుత్వం వద్దలేదు. దీంతో బాబు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. గడిచిన రెండేళ్లుగా ఆయన చేసిన కృషి ఫలించింది. దీంతో కేంద్రం ఇక్కడ 10 వేల పక్కా గృహాలను అది కూడా పేదల కోసం అధునాతన వసతులతో నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇన్నాళ్లూ ఏపీకి కేంద్రం ఏం చేసిందన్న ప్రశ్నకు ఇప్పుడు ఈ విషయంపై దృష్టి పెడుతున్నారు రాష్ట్రంలోని బీజేపీ నేతలు. విషయంలోకి వెళ్తే.. రాజధాని అమరావతి పరిధిలోని 27 గ్రామాల్లో సొంతిల్లు లేని 7876 కుటుంబాల ను ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ కలిపి పెనుమాక, దొండపాడు, అనంతవరం, తుళ్లూరు, నిడమర్రు, ఐనవోలు, నవులూరు, మందడం, ఉండవల్లి గ్రామాల్లో ప్రత్యేక కాలనీలను నిర్మిస్తోంది. ఇందుకు ఏపీ సీఆర్డీఏ 44.05 ఎకరాలను కేటాయించింది.
త్వరలోనే పనులు ప్రారంభం...
తొలిదశలో 5024 గృహాలను రూ. 345 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. భవన నిర్మాణాల వ్యయం రూ.296 కోట్లు కాగా, మిగతా రూ 49 కోట్లను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు.ఏపీ టిడ్కో డిజైన్ చేసి న ఈ కాలనీల్లో విశాలమైన రహదారులు, కాలువలు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యాలతో పాటు పార్కు, ఆసుపత్రి, పాఠశాల, గ్రంథాలయం వంటి సదుపాయాలుంటా యి. అనంతవరంలో ఇప్పటికే కొన్ని బ్లాకుల నిర్మాణం పూర్తయింది. పెనుమాకలో త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. అయితే, ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టడం సాధ్యమా ? అంటే కానేకాదనే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎంఏవై పథకంలో ఈ కాలనీలను నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకం అర్బన్ ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అమరావతికి పది వేల గృహాలను కేటాయించారు. ప్రస్తుతం 8 వేల ఇళ్లకు డిమాండ్ ఉండగా, తొలిదశ కింద 5024 గృహాల నిర్మాణాన్ని చేపట్టారు.
రెండో దశ కింద.....
పథకం నిబంధనల మేరకు వీటిని జీ+3 భవన సముదాయాలుగా నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తుకు ఎనిమిదేసి ఫ్లాట్ల వంతున ఒక్కొక్క భవన సముదాయానికి 32 ఫ్లాట్లు వస్తాయి. ఈ ఫ్లాట్లు 300, 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో మూడు రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా రెండోదశ కింద ఉండవల్లి, మందడం, నవులూరు గ్రామాల్లో మరో 2852 గృహాలను నిర్మించేందుకు సీఆర్డీఏ రంగం సిద్ధం చేసింది. మరి ఈ ఇళ్ల నిర్మాణం వెనుక ఎవరున్నారో ఇప్పటికైనా అర్ధమయ్యే ఉంటుంది. సో.. ఇదీ కథ!!
- Tags
- రాజధాని అమరావతి

