రాజు గారు రికార్డులు బద్దలు కొట్టేస్తున్నారే...!

కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టేస్తున్నారు. విమానయాన శాఖను సుదీర్ఘంగా కొనసాగిన ప్రఫుల్ పటేల్ 42 నెలల రికార్డ్ ను ఆయన చెరిపేశారు. అలాగే టిడిపిలో గతంలో కేంద్ర కేబినెట్ లో రెండేళ్లకు మించి ఉపేంద్ర, బోళ్ళ బులిరామయ్య , ఎర్రన్నాయుడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవిలో కొనసాగలేదు. ఆ రికార్డ్ ను అశోక్ ఎప్పుడో అధిగమించారు. ఇక కేంద్రమంత్రిత్వ శాఖల పనితీరులో గతంలో 10 ర్యాంక్ లో వున్న స్థానాన్ని 3 ర్యాంక్ కి తెచ్చి తనపనితీరు చాటిచెప్పారు.
కొత్త ఎయిర్ పోర్టుల్లో మరో రికార్డ్ ..
అశోక్ గజపతి రాజు పదవి చేపట్టకముందు 70 ఏళ్ళ స్వతంత్ర భారతావనిలో 70 ఎయిర్ స్ట్రిప్ లు మాత్రమే అందుబాటు లో ఉండేవి. ఆయన వచ్చాక ఈ నాలుగేళ్ల లోపే 80 కొత్త విమానాశ్రయాలను అందుబాటులోకి తెచ్చిన మంత్రిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి తేవడమే కాదు అక్కడ కార్యకలాపాలు పెరిగేలా చర్యలు, సామాన్యులకు అందుబాటులో విమానయాన టికెట్ ధరలు ఉండేలా ఆయన తీసుకున్న చర్యలు మంచి ఫలితాలే అందించాయి. ఇక ఇటీవల మోడీ కేబినెట్ విస్తరణలోనూ ఆయన స్థానం పదిలంగా ఉండటం వెనుక అశోక్ పనితీరు అన్నది సుస్పష్టం. నిజాయితీగా ఉండటం, ముక్కుసూటిగా వ్యవహరించడం ,అప్పగించిన పని తప్ప మరో పని పై దృష్టి పెట్టని అశోక్ గజపతి తీరు మిగిలిన వారికి ఆదర్శమని చెప్పాలి.
- Tags
- అశోక్ గజపతి రాజు

