రణరంగంగా మారిన ఓయూ

ఉస్మానియా యూనివర్శిటీలో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. ఓయూ రణరంగాన్ని తలపించింది. ఆత్మహత్యకు పాల్పడ్డ ఓయూ విద్యార్థి మురళి మృతదేహాన్ని తరలించడానికి వీల్లేదంటూ పట్టుబడ్డ విద్యార్థులకు... ఎలాగైనా తరలించి తీరాలని పోలీసులకు మధ్య యుద్ధవాతావరణంలా మారింది. అడ్డుకున్న విద్యార్థులను లాఠీలతో చెదరగొట్టి.. హాస్టల్ తాళాలను పగులగొట్టి పోలీసులు పైచేయి సాధించారు.
విద్యార్థులను చేధించుకుని....
మానేరు హాస్టల్.. రాత్రి మూడు గంటల సమయంలో హాస్టల్ లోపలికి వెళ్లారు పోలీసులు. అడుగడుగునా నిలువరించేందుకు విద్యార్థులు చేసిన ప్రయత్నాలను అధిగమించారు పోలీసులు. మానేరు హాస్టల్ మొదటి అంతస్తులోని బాత్రూమ్ గదిలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మురళి బలవన్మరణానికి పాల్పడటంపై విద్యార్థులు భగ్గుమన్నారు. నిన్నటి నుంచి మురళి మృతదేహం అలానే కొక్కానికి వేలాడుతున్నా.. దింపేందుకు యత్నించిన పోలీసుల్ని ప్రతిఘటించారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ జాప్యం కారణంగానే మనస్థాపానికి గురై మురళి బలవన్మరణానికి పాల్పడ్డాడని.. ప్రభుత్వం మృతుని కుటుంబానికి కోటి లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. మురళి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అతని మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనుమతించబోమని భీష్మించారు విద్యార్థులు. నిన్నటి నుంచి పోలీసులు ప్రయత్నించినా అవాంతరాలు ఎదురయ్యాయి. చివరికి అర్థరాత్రి దాటాక సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని వందలాదిగా మోహరించిన సాయుధ పోలీసు బలగాలు ఓయూకు చేరుకున్నాయి. విద్యార్థుల రాళ్లదాడిని ఎదుర్కొంటూ పోలీసు బలగాలు ముందుకు కదిలాయ్. హాస్టల్ తలుపులు పగులగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు పోలీసులు.
పోలీసులకు గాయాలు....
విద్యార్థుల ఎదురుదాడిలో నలుగురు పోలీసుల తలలు పగిలాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని చెదరగొట్టి.. అరెస్టు చేసి ఓయూ పోలీసుస్టేషన్ కు తరలించారు. ఓ ఛానల్ ప్రతినిధిని సైతం అరెస్ట్ చేశారు పోలీసులు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మురళి మృతదేహానికి పోస్టుమార్టం కోసం గాంధీమార్చురీకి తరలించారు పోలీసులు. ఓయూలో భారీగా పోలీసు పికెటింగ్ ను ఏర్పాటు చేశారు.

