రజనీ ముహూర్తం చూసుకుంటున్నారా?

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపూ సూపర్ స్టార్ రజనీకాంత్ వైపే ఉంది. రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయమైంది. అయితే పార్టీ ప్రకటన ఎప్పుడనే టెన్షన్ మళ్లీ అభిమానులకు పెట్టేశారు రజని. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన రజనీకాంత్ తమిళనాడులో 2021లో జరిగే శాసనసభ ఎన్నికల్లో మాత్రం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. అభిమానుల సమావేశంలోనే తన రాజకీయ అరంగేట్రంపై స్పష్టత ఇచ్చిన రజనీ యుద్ధానికి సన్నద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారు. దీంతో రజనీ ఫ్యాన్స్ తమిళనాడు వ్యాప్తంగా పండగే చేసుకున్నాయి.
ఇప్పట్లో లేనట్లేనా?
అయితే రజనీ రాజకీయంలోకి వస్తానని ప్రకటించిన తర్వాత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కూడా కలిసి ఆశీస్సులు పొందారు. ఇప్పుడు రజనీకాంత్ ‘2.0’ సినిమాపైనే ఫోకస్ పెట్టారు. ఈ సినిమా విడుదలయిన తర్వాత పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలకే వినియోగించాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే రజనీ అభిమానులు సంక్రాంతి సందర్భంగా పార్టీని ప్రకటిస్తారని భావించారు. కాని రజనీ ఇప్పట్లో పార్టీని ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది. పార్టీ ప్రకటన కు మంచి ముహూర్తం కోసం రజనీ పండితులను సంప్రదించినట్లు సమాచారం.
జెండాపైనా స్పష్టత లేదు....
అంతేకాకుండా పార్టీ లోగో, రంగులపైన కూడా సన్నిహితులతో జరిపే చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. జెండా రూపకల్పన బాధ్యతను ఒక ఏజెన్సీకి ఇచ్చారు. దాదాపు పది రకాల డిజైన్లతో జెండాలను రూపొందించిన ఏజెన్సీ ఇచ్చిన వాటిపై రజనీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కొన్ని రంగులు మార్చాలని ఆయన చేసిన సూచనలతో తిరిగి రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్ సభ్యత్వం కోసం వెబ్ సైట్ ను ప్రారంభించారు. రజనీ మండ్రం వెబ్ సైట్లో లక్షల కొద్దీ ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. దీనికి వచ్చిన స్పందన చూసిన రజనీ ఫుల్లు ఖుషీ అయిపోయారు.
భారీ బహిరంగ సభ ద్వారా...
దీంతో ఇక జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని రజనీ నిర్ణయించుకున్నారు. జిల్లాల వారీగా నమోదయిన సభ్యత్వాలను పరిశీలించిన రజనీ వెబ్ సైట్ లో కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి తన కార్యకర్తలచేత సభ్యత్వాలను నమోదు చేయించాలని భావిస్తున్నారు. పెద్ద జిల్లాల్లో పదిలక్షలు, చిన్న జిల్లాల్లో ఐదు లక్షలకు మించకుండా సభ్యత్వాలను నమోదు చేయించేలా రజనీ ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెలలో రజనీ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలలో చెన్నైలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలన్నది రజనీ ఆలోచన. మరి ముహూర్తం కుదిరితే ఏప్రిల్...లో లేకుంటే....మరో నెల ఆగైనా పార్టీని ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు.
- Tags
- రజనీకాంత్

