రఘువీరా కొత్త నినాదం : బాబు పోతేనే జాబు గ్యారంటీ

ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఎలాగోలా నిలబెట్టాలని తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్న పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఇప్పుడు కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ‘‘బాబు పోతేనే జాబు గ్యారంటీ’’ అంటూ ఆయన కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ‘‘బాబు వస్తే జాబు గ్యారంటీ’’ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే నినాదాన్ని రివర్సులో బాబును బద్నాం చేయడానికి రఘువీరా వాడుతూ ఉండడం విశేషం.
పీసీసీ హోదాలో ప్రత్యేకహోదా కోసం ఉద్యమం అంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్నాళ్లుగా హడావుడి చేస్తున్నారు. కానీ జనంలోనే పెద్దగా ఆదరణ రావడం లేదు. ఇక ప్రత్యేకహోదా పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టేశారేమో అని జనానికి అభిప్రాయం కలిగేలా ఆయన ఓ సంగతి ప్రకటించారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేస్తారంటూ కొత్త పాట అందుకున్నారు. అందుకు ముందుగా చంద్రబాబునాయుడు ఓడిపోవాలని కూడా అభిలషిస్తున్నారు. చంద్రబాబునాయుడు సర్కారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే.. ఢిల్లీ పార్లమెంటు గద్దెమీద రాహుల్ గాంధీ ఎలా కూర్చుంటారో.. లాజిక్ రఘువీరాకే తెలియాలి గానీ.. ఊహాజనితమైన కోరికలతో.. మితిమీరిన స్వామిభక్తిని ప్రదర్శిస్తూ.. పోరాట బాటలను కూడా రఘువీరా గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తోంది.

