యూత్ ఫోకస్ : ‘జోనల్’ ఎత్తివేతపై ఎక్కుపెట్టిన టీతెదేపా!

కొత్త జిల్లాల ఏర్పాటు పర్వం పూర్తయిపోయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఇక రాష్ట్రంలో బలపడడం గురించి కాస్త దృష్టిపెడుతున్న వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంపై పార్టీనాయకులు కీలక కసరత్తులు చేస్తున్నారు. ఈమేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఓ సమావేశం కూడా నిర్వహించారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటూ.. యువతకు ఉపాధి కల్పనకు , ప్రభుత్వోద్యోగాలకు సంబంధించిన జోనల్ వ్యవస్థ రద్దు అనే అంశాన్ని పోరాటంగా మలచుకుని యువతలో ఆదరణ చూరగొనడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఒకప్పట్లో కంచుకోట లాంటిదే అయినప్పటికీ.. మారిన పరిస్థితుల్లో ఆ పార్టీ ఇక్కడ కునారిల్లుతోంది. పార్టీకి ఉన్న సీనియర్లు యావత్తూ గులాబీ పార్టీలోకి వలస వెళ్లారు. తెదేపాను రాష్ట్రంలో కాపాడుకోవలంటే.. నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం తప్ప దిక్కులేదు. అందుకే యువతను ప్రధానంగా ప్రోత్సహించాలనే వ్యూహంతో తెదేపా ముందుకెళ్తోంది. జిల్లాల్లో ఉన్న సీనియర్లు కూడా గులాబీ దిశగా మళ్లిపోయిన తర్వాత.. అచ్చంగా.. పార్టీకి జిల్లాస్థాయి, నియోజకవర్గస్థాయి కమిటీలు వేయాలన్నా సరే.. కొత్త నెత్తురుకోసం దేవులాడాల్సిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో యువత చేతుల్లోనే పార్టీ పగ్గాలు పెట్టాలని నాయకత్వం భావిస్తోంది.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల ఎంపికలో జోనల్ వ్యవస్థను ఎత్తివేయాలనే ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించనున్నట్లు తెలుగుదేశం నాయకులు ప్రకటిస్తున్నారు. జోనల్ వ్యవస్థ లేకపోతే.. తెలంగాణ లోని అనేక వెనుకబడిన ప్రాంతాల యువతరానికి ఉద్యోగావకాశాలు దక్కించుకోవడంలో అన్యాయం జరుగుతుందని తెదేపా వాదిస్తోంది. జోనల్ వ్యవస్థ గురించిన పోరాటంతో పార్టీ యువతలోకి చొచ్చుకుపోవాలని ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి పార్టీని బలోపేతం చేసే దిశగా వారి ప్రయత్నాలు ఎలా, ఎప్పటికి ఫలిస్తాయో వేచిచూడాలి.

