యుద్ధం తప్పేట్లు లేదే...?

ఉత్తరకొరియాలకు ధీటుగా దక్షిణ కొరియా కూడా సమాధానం చెప్పింది. ఉత్తర కొరియా బుధవారం బాలిస్టిక్ క్షిపణిని జపాన్ కు అతిదగ్గరగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీనికి హాంసాంగ్ 15 అని నామకరణంచేశారు. ఈ క్షిపణి ప్రయోగంతో అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేయగలమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. అయితే దక్షిణ కొరియా కూడా ఏమాత్రం తగ్గ లేదు. రాజధాని సియోల్ మీదుగా దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగాన్ని జరిపింది. దీంతో రెండు దేశాలూ కవ్వింపు చర్యలకు దిగినట్లయింది.
దక్షిణ కొరియా కూడా ధీటుగా....
రెండు నెలల నుంచి నిశ్శబ్దంగా ఉన్న ఉత్తరకొరియా మళ్లీ విజృంభించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తరకొరియాను ఉగ్రదేశంగా ప్రకటించిన నేపథ్యంలో కిమ్ ఈ బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు జరిపినట్లు చెబుతున్నారు. అమెరికాతో పాటు తమను వ్యతిరేకిస్తున్న అన్ని దేశాలకూ సరైన సమాధానం చెప్పేందుకే ఈ క్షిపణి పరీక్షలు కిమ్ నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశముందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. కిమ్ కవ్వింపు చర్యలు మాత్రం ఆగడం లేదు. అమెరికాను టార్గెట్ చేసుకునే కిమ్ ఈ చర్యలకు దిగుతున్నారన్నది స్పష్టమవుతోంది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాను కూడా ధ్వంసం చేయాలన్నది కిమ్ ఆలోచన. మొత్తంమీద ఉత్తర కొరియా, దక్షిణ కొరియా క్షిపణి పరీక్షలతో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.

