మౌనముని గళం విప్పితే మంత్రం అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్న కాంగ్రెస్ పార్టీ అందుకు ప్రత్యేకహోదా అనే అంశాన్ని వీలైనంత వరకు ఉపయోగించుకోవాలని తపన పడుతోంది. ప్రత్యేకహోదా అనే పదం మీద ప్రజల్లో ఇప్పటికీ ఉన్న భావోద్వేగాలను, సెంటిమెంటును వాడుకుని.. తాము పోరాటాన్ని కొనసాగిస్తే.. హోదా సంగతి ఎటు పోయినా.. పార్టీకి కాస్త మంచి పేరు వస్తుందనే అభిప్రాయం వారిలో ఉంది. అందుకే వారు తమ పోరాటానికి ఒక గుర్తింపు ఉండేలాగా ఇప్పుడు కొత్త ఎత్తుగడను ఆశ్రయిస్తున్నారు.
ప్రత్యేక హోదా ఇస్తా అని రాజ్యసభలో విస్పష్టంగా ప్రకటించిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్నే తెరమీదకు తేబోతున్నారు. ఆయనతో కేవలం రాజ్యసభలో మాట్లాడించడం మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో బహిరంగ సభ పెట్టి.. ఆయనతో మాట్లాడింపజేయాలని అనుకుంటున్నారు.
హోదా కోసం పోరాటంలో భాగంగా.. విజయవాడలో బహిరంగ సభ పెడతాం అని, అందులో పాల్గొని మాట్లాడాల్సిందిగా.. పీసీసీ నేతలు రఘువీరా, కేవీపీ ప్రభృతులు మన్మోహన్సింగ్ను కలిసి అభ్యర్థించబోతున్నారు. హామీ ఇచ్చిన ప్రధాని ద్వారానే.. పోరాటాన్ని నడిపితే.. ప్రభుత్వంలో కదలిక వస్తుందని.. తమ పార్టీ కి ఉన్న చెడ్డపేరు పోతుందని వారి ఆలోచనగా ఉంది. అయితే సాధారణంగా మౌనమునిగా పేరున్న మన్మోహన్సింగ్.. సీరియస్ రాజకీయాలకు సూటయ్యే వ్యక్తి కాదు. ఏపీ తరహా , హోదాను సాధించగల మార్కు రాజకీయ పోరాటాలకు ఆయన ఎలా ఒప్పుకుంటారో, వీరికి ఎలా సహకరిస్తారో తెలియదు.
నిజానికి ఏపీలో కాంగ్రెస్ను బతికించుకోవడం అనేది తమ సొంత ఇంటి వ్యవహారం లాగా, రాష్ట్ర నాయకులు తపన పడుతున్నారు, ఆరాటపడుతున్నారు తప్ప.. కేంద్ర నాయకత్వం నుంచి వీరికి లభిస్తున్న మద్దతు చాలా పరిమితంగా ఉంటోంది. హోదా విషయానికే వస్తే.. సోనియాగాంధీ ప్రభృతులు సీరియస్గా హోదా ఇప్పించాలనే అనుకుంటే గనుక.. పోరాటం ముఖచిత్రం మరోలా ఉండేది. అలాంటి నేపథ్యంలో మన్మోహన రుషి.. వీరి పోరాటానికి ఎలాంటి చేయూత నిస్తారనేది ఆసక్తికరంగా ఉంది.

