మోదీ ఉవాచ : ఫోనే బ్యాంకు.. పండగ చేసుకోండి!

విపక్షాలు నోటు కష్టాల విషయంలో పార్లమెంటును కనీసం గంటలసేపైనా నిలకడగా జరగనివ్వకుండా చాలా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నాయి. రకరకాల విమర్శలను చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని ఫక్తు రాజకీయ విమర్శలుగా కొట్టిపారేయవచ్చు. ఎంతచెడ్డా.. వారి వాదనలో ఒక విషయం మాత్రం.. సబబే అనిపిస్తుంది. మోదీ ఈ నోటు కష్టాలు- సంబంధిత విషయాలపై బయట మాట్లాడుతున్నారు.. సభలో మాత్రం పెదవి విప్పడం లేదు.. అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రస్తావించే సమస్యలను పరిష్కరించడం సంగతి తరువాత.. ముందుగా అసలు ప్రతిస్పందించకుండా.. మోదీ వారీ ఈగోను కూడా హర్ట్ చేస్తున్నారనేది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రజల్లో నోటు కష్టాలు ఎలా ఉన్నప్పటికీ.. ఎన్నికల ప్రచారం.. గట్రా సభల్లో నిరాటంకంగా పాల్గొంటున్న నరేంద్రమోదీ శనివారం నాడు యూపీలో ఓ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలకు నోటు కష్టాల విషయలో చాలా సులువైన పరిష్కారాలను సూచించేశారు. అసలు మీరు ఏటీఎంలకు వెళ్లవలసిన అవసరమేలేదు, మీ చేతిలోనే బ్యాంకు ఉంది. మీ మొబైల్ ఫోనే ... మీ బ్యాంకు .. అంటూ తీయ్యటి రుచికరమైన మాటలను మోదీ వల్లించారు. అఃటే దేశమంతా ఆన్ లైన్ లావాదేవీలు చేసుకోవాలన్నది ఆయన ఆకాంక్ష.
అది ఎన్నికల ప్రచార సభ గనుక అభివృద్ధి నినాదాన్ని ఆయన వినిపించారు. అన్ని సమస్యలకు అదే పరిష్కారం అని, అవినీతితో దేశం నాశనం అయిందని ఆయన పాత ప్రభుత్వాల్ని ఆడిపోసుకున్నారు. తనకు పేదలే హైకమాండ్ అని.. వారి కంటె ఏదీ ఎక్కువ కాదని సెలవిచ్చారు. వారివాళ కూలి పనులు మానుకుని రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగవలసి వస్తున్న దుస్థితికి నిష్కృతి ఏమిటో మాత్రం ఆయన సెలవివ్వలేదు.
అయితే ప్రధాని నరేంద్రమోదీ పలుకులు.. తొందరపడి తెల్లారక ముందే కూసేసిన కోడి కూతల్లా ఉన్నాయి. ఈ దేశంలో ‘‘మీచేతిలో ఉన్న ఫోనే బ్యాంకు’’ అని చెప్పగల పరిస్థితి నిస్పందేహంగా ఇవాళ లేదు. మహా మహా స్టేట్ బ్యాంకు సర్వర్లే ఇప్పుడున్న ఒత్తిడిని తట్టుకోలేక రోజులో చాలా గంటలపాటూ స్తంభించిపోతున్నాయి. అలాంటిది ప్రజలందరూ ఫోన్లద్వారా వాడితే పనిచేయించగల సత్తా ఆ వ్యవస్థలో ఉందన్న హామీని మోదీ ఇవాళ ఇవ్వగలరా?
నరేంద్రమోదీ.. మరో ఆరునెలల తరువాత.. ఈ డైలాగు వేసి ఉంటే చాలా సబబుగా ఉండేది. అప్పటికి జనం మొబైల్ లావాదేవీలకు అలవాటు పడి ఉంటారు. కిందామీదా పడుతూ పనిచేసుకుంటూ ఉంటారు. బ్యాంకుల మీద ఆధారపడడం తగ్గి ఉంటుంది. ఇలాంటి పడికట్టు మాటలు చెబితే నమ్ముతారు. అంతే తప్ప.. ఇప్పుడు ఒకవైపు బ్యాంకుల వద్ద వందల సంఖ్యలో క్యూలైన్లలో నిల్చుని పడిగాపులు కాస్తున్న వాళ్లకు.. ’’అబ్బే మీరెందుకిక్కడ ఉండడం.. మీ చేతిలో బ్యాంకు ఉంది కదా..’’ అని అంటే.. వెటకారాలాడుతున్నట్లుగా బాధపడతారు. ప్రజలను అలా బాధపెట్టడం మోదీ లాంటి పాలకుడికి పాడి కాదు.

