మోడీపై వ్యంగం... మండిపాటు...!

బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న శివసేన మరోసారి ప్రధాని మోడీపై మండి పడింది. ఆయన అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. తన అధికార పత్రిక సామ్నాలో ఏకిపారేసింది. మోడీ ఇటీవల గుజరాత్ ఎన్నికల ప్రచారంలో చేసిన...చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది శివసేన. మోడీ ఇంత కిందకు దిగజారతారని తాము కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. గుజరాత్ ఎన్నికల్లో మోడీ అభివృద్ధి గురించి మాట్లాడాల్సి ఉండగా.. మొఘల్ కాలపు సమాధులను తవ్వుతున్నారని శివసేన తీవ్రంగా సామ్నాలో తప్పుపట్టింది. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అధికారానికి 22 ఏళ్లు దూరమయిందని శివసేన గుర్తు చేసింది. గుజరాత్ ప్రచారంలో బీజేపీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని పేర్కొంది.
ప్రచారం దిగజారిందంటున్న.....
మోడీ ఇప్పుడు జాతీయనేత అని, ఆ విషయాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేసింది. మోడీ తాను ఇంకా గుజరాత్ కే పరిమితమైన ఒక ప్రాంతీయ నేతగా భావిస్తున్నారని సామ్నా పత్రికలో పేర్కొనడం గమనార్హం. మోడీ ఇంత భావోద్వేగానికి గురికావాల్సిన అవసరం లేదంది. ఒక్క రాహుల్ ను ఓడించడానికి ప్రధానితో పాటు అమిత్ షా, కేంద్రమంత్రుల, ముఖ్యమంత్రులూ ప్రచారం చేయడమేమిటని ఎగతాళి చేసింది. ఇక కాంగ్రెస్ మాజీ నేత మణిశంకర్ అయ్యర్ విషయాన్ని కూడా సామ్నా పత్రికలో ప్రస్తావించారు. అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై మోడీ అతిగా ప్రవర్తించారని శివసేన అభిప్రాయపడింది. అయ్యర్ వ్యాఖ్యలు మోడీని అవమానర్చే విధంగా ఉన్నాయి కాని, గుజరాత్ ప్రజలందరినీ అవమానపర్చినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించింది. మోడీ దేశ ప్రజలందరి కోసం నిలబడాలని తాము కోరుకుంటున్నామని, కాని ఆయన గుజరాత్ కే పరిమితమయినట్లు వ్యవహరిస్తున్నారని శివసేన తీవ్రంగా మండిపడింది. గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటుందన్న వాదనను కూడా శివసేన కొట్టిపారేసింది.

