మోడీపై పవన్ ఇక దబిడి దిబిడేనా....?

జనసేన అధినేత పవన్.. కేంద్రంపై తన గళాన్ని ఇక మరింత వాడిగా వేడిగా వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని గతంలో పవన్ హామీ ఇచ్చాడు. అదేసమయంలో ప్రత్యేక హోదా విషయంలో ప్లేటు మార్చిన కేంద్రంపై విరుచుకుపడ్డాడు కూడా. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి అందరిలోనూ విస్మయాన్ని కలిగించి ఆలోచింప జేసిన పవన్.. ఇప్పుడు కేంద్రం మరో సారి ఏపీకి చేసిన అన్యాయంపై ఆయన గళం విప్పేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
ఏపీకి ప్రయోజనాలు అందకపోవడంపై....
కేంద్రంలోని బీజేపీ సర్కారుకు 2014లో అనుకూలంగా మాట్లాడి ఓట్లు పడేలా చేసిన పవన్ తర్వాత నిర్వహించిన రెండు మూడు సభల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏపీకి న్యాయం జరుగుతుందని, విభజన బాధలు తగ్గుతాయని భావించే తాను అప్పట్లో మద్దతు ప్రకటించిన విషయాన్ని కూడా పవన్ చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన చిట్టచివరి పూర్తిస్తాయిలో బడ్జెట్లో ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రయోజనాలను ప్రస్తావించకపోవడం, కేంద్రం ఏపీని ఏ విధంగా ఆదుకుంటుందో చెప్పకపోవడం, నిధులకు సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు అందించేలా చేయకపోవడం వంటి కారణాలు ఏపీ ప్రజలను తీవ్రంగా ఆవేదనకు గురి చేశాయి.
కేంద్రంపై తిరగబడతారా?
ప్రతిష్టాత్మకమైన నవ్యాంధ్ర రాజధాని అమరావతి పూర్తికాకపోవడం, పారిశ్రామికంగా పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా కనిపించక పోవడం కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి ఎలాంటి సాయం లేదని రూఢీ కావడంతో ఇప్పుడు కేంద్రంపై తిరగబడక తప్పని పరిస్థితి ఉందనేది ప్రజల వాదన. ఈక్రమంలోనే వైసీపీ అధినేత జగన్.. ఇప్పటికే కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి నొప్పి తెలియని విధంగా కేంద్రంపై విమర్శలు చేయాలని, అదేసమయంలో చంద్రబాబును సైతం విమర్శించాలని జగన్ యోచిస్తున్నాడు.
త్వరలోనే మళ్లీ పర్యటన.....
ఇక, ఇప్పుడు జనసేనాని కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఏపీలో ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో పర్యటించి సభలు సమావేశాలు సహా రోడ్ షోలు సైతం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆయన కేంద్రం వైఖరిపై విరుచుకుపడతారని అందరూ అనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారతాడని భావిస్తున్న పవన్‌కు ఇప్పుడు బడ్జెట్ అంశం అత్యంత కీలకం. దీనిపై ప్రజలు పెట్టుకున్న ఆశలకు భిన్నంగా కేంద్రం వ్యవహరించి, ఏపీ అనే రాష్ట్రం ఒకటి ఉంది అన్న విషయాన్ని కూడా విస్మరించిందని ప్రజలు భావిస్తున్నారు.
కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు....
ఈక్రమంలో పవన్ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్థావించి ప్రజల్లో భరోసా నింపేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చేస్తారని అందరూ భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే పవర్ స్టార్ పవన్.. తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. ఇదే జరిగితే.. రాబోయే రోజుల్లో ఏపీ ప్రజల ఆవేదన పవన్ గళం ద్వారా కేంద్రానికి మంట పుట్టించడం ఖాయమనే సిగ్నల్స్ వస్తున్నాయి. మోడీని టార్గెట్‌గా చేసుకుని పవన్ విరుచుకు పడతాడని కూడా జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి పవన్ మోడీని ఎలా టార్గెట్ చేస్తాడో ? చూడాలి.
- Tags
- పవన్ కల్యాణ్

