మోడీద్వయానికి ఈ వరుస దెబ్బలేంటి?

బీజేపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా ఎన్డీఏ కూటమిని వీడి వెళ్లిపోతున్నాయి. మొన్న శివసేన తాము వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోమని చెప్పిన సంగతి తెలిసిందే. నిన్న తెలుగుదేశం పార్టీ ఏపీ విభజన హామీలను అమలుపర్చడం లేదంటూ ఎన్డీఏ నుంచి వైదొలగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకోవడం, గొరఖ్ పూర్, ఫూల్ పూర్ లోక్ సభ ఎన్నికల్లో పరాజయం కమలనాధులకు ఊపిరి సలపనివ్వడం లేదు. వీటిపై విశ్లేషణలు చేస్తున్నారు.
మరో మిత్రపక్షం కూడా...
అయితే తాజాగా మరో మిత్రపక్షం కూడా అసమ్మతి స్వరాన్ని విన్పించింది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తమను బీజేపీ సంప్రదించడం లేదంటూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. బీజేపీ మిత్రధర్మాన్ని పాటించడం లేదంటూ ఆ పార్టీ నేత ఓప్రకాశ్ రాజ్ భార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ కూడా త్వరలోనే కూటమి నుంచి తప్పుకుంటుందని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల విషయంలోనే ఆ పార్టీ అసంతృప్తికి గురయినట్లు తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికలే....
రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీన ఉత్తరప్రదేశ్ లో పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల గొరఖ్ పూర్, ఫూల్ పూర్ ఉప ఎన్నికల్లో ఓటమితో యూపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూస్తే పది రాజ్యసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను సులువుగా బీజేపీ గెలుచుకుంటుంది. తొమ్మిదో స్థానానికి కూడా బీజేపీ పోటికి నిలపాలని భావిస్తోంది. తొమ్మిదో స్థానం దక్కించుకోవాలంటే 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే బీజేపీకి చెందిన 28 మంది సభ్యులతో పాటు సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులతో ఆ సంఖ్య 32కు చేరుకుంటటుంది. మిగిలిన సభ్యుల మద్దతు కోస బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తమను సంప్రదించలేదంటూ ఎస్.బి.ఎస్.పి నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాము రాజ్యసభ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్నదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నేత ఓంప్రకాశ్ రాజ్ భార్ వ్యాఖ్యానించడం ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
- Tags
- బీజేపీ
