మోడీది ఒక రూటు.. రాహుల్ ది సపరేటు...!

గుజరాత్ చివరి దశ ఎన్నికల ప్రచారం పూర్తయింది. మంగళవారంతో ప్రచారం ముగిసింది. అయితే చివరి రోజు ప్రధాని నరేంద్రమోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు గుజరాత్ లోపర్యటించారు. ముఖ్యంగా రాహుల్ మరోసారి ఆలయాలను సందర్శించారు. గుజరాత్ లో ఎలాగైనా కాంగ్రెస్ ను గట్టెక్కించాలని ఆయన ఇటీవల కాలంలో ఆలయాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారం చివరిరోజైన మంగళవారం రాహుల్ అహ్మదాబాద్ లో పర్యటించారు. అక్కడి ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగన్నాధ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు కూడా రాహుల్ నిర్వహించారు. రాహుల్ ఇప్పటికే గుజరాత్ లో సోమనాధ్, ద్వారకాదేష్, చోటీలా, జలరామ్ బాపూ ఆలయాలను సందర్శించారు. హిందు ఓట్ల కోసమే రాహుల్ ఆలయాల బాట పట్టారని బీజేపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
సీప్లేన్ లో ప్రయాణించిన మోడీ....
అయితే ప్రచారానికి చివరిరోజైన మంగళవారం రాహుల్, మోడీలు గుజరాత్ లో రోడ్ షోలలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇద్దరూ సమావేశాలకే పరిమితమయ్యారు. ప్రధాని మోడీ రోడ్ షోలకు అనుమతించకపోవడంతో ఆయన సీ ప్లేన్ లో ప్రయాణించడం విశేషం. సబర్మతి నది నుంచి మెహసానా జిల్లాలోని ధారోయ్ డ్యాం వరకూ మోడీ సీ ప్లేన్ లోనే పర్యటించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన వెళ్లి అంబాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. తొలిసారి సీప్లేన్ లో ప్రధాని మోడీ ప్రయాణించారు. దేశంలోనే మొట్టమొదటి సారి సబర్మతి నదిలో సీప్లేన్ ల్యాండ్ కాబోతుందని మోడీ ట్విట్టర్లో పేర్కొనడం విశేషం. ఇలా ప్రధాన నేతలిద్దరూ ప్రచారం చివరిరోజైన మంగళవారం ఆలయాలను సందర్శించారు. కాగా గుజరాత్ చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 14వ తేదీన జరగనుంది. ఈనెల 18వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
.

