మోడీతో వీరు ఏం మాట్లాడతారంటే...?

ప్రధాని మోడీ పర్యటన ఖరారు కావడంతో బీజేపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారు అడిగినట్లుగానే పార్టీ నేతలకు మోడీ సమయం కేటాయించారు. దీంతో మోడీ ఎదుట తమ బాధలను చెప్పుకునేందుకు కమలనాధులు సిద్ధమయ్యారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు మోడీ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్ పోర్టులోనే మోడీ బీజేపీ నేతలతో మాట్లాడతారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు బీజేపీ నేతలతో ఆయన మాట ముచ్చట చేస్తారు. ఇందుకోసం ఈ భేటీలో ఎవరెవరు పాల్గొంటారన్న దానిపై బీజేపీ నేతల నుంచి ఎస్పీజీ సిబ్బంది వివరాలు అడిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో పేర్లున్న వారినే ఈ భేటీకి అనుమతిస్తారు.
ప్రత్యేకంగా బీజేపీ నేతలతో భేటీ...
అయితే గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీలో స్తబ్దత నెలకొంది. ముఖ్యంగా తెలంగాణలో ఒక్కగానొక్క పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి తొలగించడం, తర్వాత ఆ స్థానంలో ఎవరినీ చేర్చుకోక పోవడంతో బీజేపీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలన్న తమ లక్ష్యానికి సహకరించాలని మోడీని సీనియర్ నేతలు కోరనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఎలా దుర్వినియోగం చేస్తుందీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ప్రచారం కల్పించకపోవడం వంటి విషయాలను బీజేపీ నేతలు మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. కేంద్రమంత్రులు తరచూ తెలంగాణకు వస్తున్నా బీజేపీ నేతలను పట్టించుకోక పోతుండటాన్ని కూడా కొందరు మోడీకి చెప్పనున్నట్లు తెలిసింది. మొత్తం మీద మోడీ రాకతోనైనా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని ఆ పార్టీనేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- మోడీ

