మోడీకి ఎందుకంత టెన్షన్?

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ను వదలడం లేదు. వరుస పెట్టి గుజరాత్ లో శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుజరాత్ లో మళ్లీ కాషాయ జెండాను ఎగురవేయాలన్నది బీజేపీ గట్టిగా భావిస్తోంది. గుజరాత్ లో గెలుపోటములపైనే మోడీ, అమిత్ షాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. గుజరాత్ ఎన్నికల్లో కాస్త... అటూ...ఇటూ అయినా బీజేపీలోనే వీరిద్దరి కి వ్యతిరేకంగా థిక్కార స్వరం విన్పించక మానదు. దీంతో గుజరాత్ ఎన్నికలను మోడీ, షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల నెల రోజుల్లోనే మోడీ గుజరాత్ కు రావడం నాలుగోసారి. గుజరాత్ లో ఎక్కడ చూసినా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి.
నాలుగోసారి గుజరాత్ కు......
తాజాగా ఈరోజు మోడీ గుజరాత్ లో పర్యటించారు. రోరీ ఫెర్రీ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. రోల్ ఆన్.. రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీస్ ను మోడీ నేడు ప్రారంభించారు. 2012లో మోడీయే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇది ఘోఘా -దహేజ్ మధ్య నడిచే సర్వీసు. ఈ సందర్భంగా మోడీ బహిరంగ సభలో ప్రసంగించారు. రోరో ఫెర్రీ ప్రాజెక్టు దేశానికి వరమన్నారు. ఈ ఫెర్రీసర్వీసును కేవలం ఒక మార్గానికే పరిమితం చేయబోమని, హజీరా, పిపపవ్, జఫరాబాద్, డామన్-డయ్యూ లతో ఈ మార్గాన్ని అనుసంధిస్తామని చెప్పారు. గుజరాత్ అభివృద్ధికి యూపీఏ సర్కార్ గతంలో అడ్డుకుందన్నారు. యూపీఏ సర్కార్ గతంలో గుజరాత్ లోని అన్ని ప్రాజెక్టులను నిలిపేసిందని ఆరోపించారు. మొత్తం మీద గుజరాత్ ఎన్నికలుదగ్గర పడుతున్న కొద్దీ మోడీలోనూ కొంత టెన్షన్ కనపడుతుందనే చెప్పాలి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం కూడా ఇందుకు ఒక కారణంగా భావించవచ్చు.
- Tags
- గుజరాత్ మోడీ

