మోడీకి అందుకే దూరమవుతున్నారా?

ప్రధాని నరంద్ర మోడీ క్రమంగా మిత్రులకు దూరమవతున్నారా? సొంత పార్టీలో ఉన్న అసంతృప్తులు ఇప్పటికిప్పుడు గళం విప్పకపోయినా... మిత్రులు ఎందుకు ఊరుకుంటారు? వారి రాష్ట్రంలో వారే రారాజులు. దీంతో అంతటా తానే మహరాజననుకుంటున్న మోడీకి మిత్రపక్షాలు క్రమంగా దూరమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇప్పటికే ఇరవై ఏళ్ల బంధాన్ని శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. శివసేన బయటకు వెళ్లడానికి మహారాష్ట్ర లోకల్ పాలిటిక్స్ కంటే కేంద్ర స్థాయిలో కమలనాధులు చేస్తున్న చర్యలే ప్రధాన కారణమని చెప్పకతప్పదు. ముఖ్యంగా మోడీ, అమిత్ షాల కాలం వచ్చిన తర్వాత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది మిత్రపక్షాలు అన్నీ చెబుతున్నాయి. అయితే ఇవి తమ అంతర్గత సమావేశాల్లోనే చెబుతున్నాయి.
ఏకపక్ష నిర్ణయాలు....
గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షాలకు విలువిచ్చే వారు. వాజపేయి హయాంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను ముందుగా మిత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకునే వారు. అంతేకాదు నిర్ణయాలు కూడా ప్రజానుకూలంగా ఉండేవి. కాని మోడీ ప్రధానిగా, అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వరుస విజయాలు వారిని ఎక్కడికో తీసుకెళ్లాయంటున్నారు. ఎవరి మాట వినే పరిస్థితి లేదు.మిత్రులు సరే... సొంత పార్టీ సీనియర్ నేతలకే నిర్ణయాల గురించి తెలియదు. ముఖ్యంగా జీఎస్టీ, నోట్ల రద్దు వంటి విషయాలు బీజేపీ నేతలకే ముందుగా తెలియలేదు. నోట్ల రద్దు అంటే ఓకే. కాని జీఎస్టీ పైన అయినా మిత్రలు, సొంతపార్టీనేతలతో కనీసం మాట మాత్రంగానైనా చెప్పలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఫక్తు రాజకీయ పార్టీగా సిద్ధాంతాలున్న బీజేపీని మార్చివేశారన్న బాధను కొందరు కమలదళం నేతలు మనసులోనే దిగమింగుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం, సిద్ధాంతాలకు తిలోదకాలివ్వడం వంటివి మోడీ, షా హయాంలోనే జరగడం ప్రారంభమయ్యాయి. వారిద్దరే ఇప్పుడు పార్టీని శాసిస్తున్నారు. దేశాన్ని శాసించాలనుకుంటున్నారు. ఇది మాత్రం మిత్రులకు మింగుడుపడటం లేదు.
శివసేన బయటకు వెళ్లడంతో...
ఈనేపథ్యంలో శివసేన బయటకు వెళ్లడంతో మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా తమ దారి తాము చూసుకునే వీలుంది. ముఖ్యంగా ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా. అదీ దక్షిణాదిలో మరీ ఎక్కువ. మోడీకి పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ ఉండబట్టి మిత్రపక్షాలైన తెలుగుదేశం మింగలేక...కక్కలేక చూస్తూ ఉరుకుంది. ఎన్నికల సమయానికి విభజన హామీలు అమలు చేయకుంటే మోడీపైనే నేరుగా విమర్శలు చేసే అవకాశముంది. అలాగే మిత్రపక్షం కాకున్నా...స్నేహితుడిగా వ్యవహరించే కేసీఆర్ మోడీ తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగానే తప్పుపడతారు. ఇక తమిళనాడులోనూ అదే పరిస్థితి. ఈ నాలుగేళ్ల మోడీ పరిపాలనలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నిత్యావసరాల దగ్గర నుంచి పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో మోడీ పాలనపై సామాన్య, మధ్య, దిగువ తరగతి ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకునే ఉంది.
మిగిలిన మిత్రులు కూడా....
దీంతో బీజేపీలో కలిసి పోటీ చేసేందుకు ఏ ప్రాంతీయ పార్టీ ఇష్టపడని పరిస్థితి ఉంది. మోడీ ఊహాలోకాల్లో జీవిస్తున్నారని, ఆయనకు క్షేత్రస్థాయిలో ప్రజలు వాయిస్ విన్పించడం లేదన్నది వాస్తవం. మోడీపై నెగిటెవ్ టాక్ ప్రారంభమయిందని గ్రహించిన శివసేన ముందుగానే మేల్కొంది. తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక టీడీపీది కూడా అదే పరిస్థితి. కాకుంటే ఎన్నికలకు కొద్దిగా ముందు ఉండే అవకాశముంది. తమిళనాడులోనూ కరుణానిధిని స్వయంగా మోడీ కలిసి వచ్చినా డీఎంకే బీజేపీకి వ్యతిరేకంగానే గళం విప్పనుంది. అయితే మోడీ మీద అపనమ్మకం ఇప్పుడిప్పుడే పార్టీల అధినాయకులకు మొదలైంది. అందుకే ఎన్నికల తర్వాతే పొత్తులు ఉంటాయని కొన్ని ప్రాంతీయ పార్టీలు ప్రకటిస్తుండటం విశేషం. మరి మోడీ గ్రాఫ్ తగ్గుతుందని తెలిసిన మిగిలిన మిత్రులు కూడా తమ దారి తాము చూసుకుంటారా? అన్న ఆందోళన కమలం పార్టీలో మొదలయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- మోడీ

