మోడీ, షాలకు ఈయన పంటికింద రాయి...!

గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావమో... లేక మోడీ, అమిత్ షాల ఒంటెత్తు పోకడలను తట్టుకోలేకనో... మొత్తం మీద బీజేపీలో సీనియర్ నేతలు అసమ్మతి స్వరాన్ని గట్టిగానే విన్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై విరుచుకుపడుతున్నారు. మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టడమే కాకుండా బీజేపీ పాలన మేడిపండు చందంలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీలో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోసారి మోడీపై విరుచుకుపడ్డారు. ఆయన పాలనపై వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఎవరినీ పట్టించుకోవడం లేదు...
యశ్వంత్ సిన్హా.. పార్టీలో సీనియర్ నేత. కేంద్రంలో అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా సీనియర్ నేతలను ఇటు ప్రధాని మోడీ, ఇటు పార్టీ అగ్రనేతలు పట్టించుకోవడం లేదు. అందుకు ఉదాహరణ తానేనని చెబుతున్నారు యశ్వంత్ సిన్హా. మోడీ అపాయింట్ మెంట్ కోసం 13నెలల క్రితం సిన్హా దరఖాస్తు చేసుకున్నారట. అదీ పార్టీ పరంగానే. తనకు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వినతిపత్రం సమర్పించారు యశ్వంత్. అయితే 13 నెలలు గడుస్తున్నా అపాయింట్ మెంట్ దొరకలేదు సరికదా సరైన సమాచారాన్ని కూడా ఈ సినియర్ నేతకు అందివ్వలేదట.
ప్రజల్లోనే తేల్చుకుంటానంటున్న.....
దీంతో కుతకుతలాడిపోతున్న యశ్వంత్ సిన్హా ఇకపై బీజేపీ నేతలెవ్వరినీ తాను కలవదల్చుకోలేదని చెప్పారు. ఇకపై ప్రజల వద్దకే వెళారంటున్నారు యశ్వంత్. అద్వానీ లాంటి సీనియర్లకు కూడా వీరు గౌరవం ఇవ్వడం లేదని మోడీ, షాలపై మండిపడ్డారు. ఇప్పటికే అనేకసార్లు యశ్వంత్ సిన్హా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీఎస్టీపై ఈ మాజీ కేంద్రమంత్రి విమర్శలు సూటిగానే చేశారు. ఐ నీడ్ టూ స్పీక్ అప్ అని ఒక వ్యాసం రాసిన యశ్వంత్ అందులోనూ వీరిపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏకంగా మధ్యప్రదేశ్ లో దీక్షకు దిగుతున్నారు. రైతులకు మద్దతుగా ఆయన ఈ దీక్ష చేపట్టబోతున్నారు. మహారాష్ట్ర రైతులకు మద్దతుగా కూడా ఆయన దీక్ష చేస్తున్నారు. మొత్తం మీద యశ్వంత్ మోడీ, షాలను ఇరుకున పెట్టాలని సీరియస్ గానే నిర్ణయంచుకున్నట్లుంది. అందుకే ప్రజల వద్దనే తేల్చుకుంటున్నానంటున్నారు యశ్వంత్. మరో వైపు షాట్ గన్ శత్రుఘ్న సిన్హా సయితం విమర్ళలు వీరిద్దరిపై పెంచడం మింగుడుపడటం లేదు.
- Tags
- యశ్వంత్ సిన్హా

