మోడీ మెలికలు చూడండయా...!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోంది. ముఖ్యంగా ఎన్డీఏ నుంచి టీడీపీ విడిపోయాక బీజేపీ కక్ష సాధింపు చర్యలు మరింత పెంచనుందన్న వార్తలు వస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపైన, ప్రధాని మోడీపైన విమర్శలకు దిగుతున్నారు. అయితే దీనికి ప్రతిగా చర్యలు వెనువెంటనే కేంద్రం చూపిస్తూ ఉండటం విశేషం. ఏపీ అభివృద్ధి కోసం సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోందన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి.
రహదారి నిర్మాణంలో ఊహించని....
ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం నిధుల గురించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. అయితే ఈ జాబితాలోకి మరొకటి వచ్చి చేరింది. అదే అనంతపురం - అమరావతి జాతీయ రహదారి. అనంతపురం నుంచి కొత్త రాజధాని అమరావతి వరకూ ఆరులేన్ల జాతీయ రహదారిని నిర్మించాలని, దీనివల్ల రాయలసీమ ప్రాంతవాసులకు రాజధానికి రావడం సులువవుతుందని ప్రభుత్వం భావించింది.
ఆరు లేన్ల నుంచి నాలుగు.....
ఈ మేరకు మూడేళ్ల క్రితమే ప్రతిపాదనలు పంపింది. కేంద్రం కూడా ఓకే చెప్పింది. మొత్తం 557 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారిపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేయనున్నారు. ఇందుకోసం జాతీయ రహదారుల సంస్థ అధ్యయనం కూడా చేసింది. కొత్త రాష్ట్రం కావడంతో వెనువెంటనే ఈ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వమూ సూచించింది. అయితే భూసేకరణలో కొంత ఆలస్యమైంది. భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చే దశలో కేంద్రం నుంచి ఆశ్చర్యకరమైన వార్త రాష్ట్రానికి అందింది.
కుదించి పారేశారే....
ఈ రహదారి వెడల్పును తగ్గించాలని నేషనల్ హైవే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మామూలుగా 200 మీటర్లు వెడల్పులో ఆరు లేన్ల రహదారి నిర్మాణాన్ని నిర్మించాలన్నది తొలి ప్రతిపాదన. అయితే తాజా ప్రతిపాదనలో ఈ వెడల్పును వందమీటర్లకు తగ్గించాలని సూచించింది. అంటే ఆరులేన్ల రహదారిలో నాలుగులేన్ల రోడ్డు మాత్రమే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం బ్రేకులు వేసినట్లే కన్పిస్తోంది. మొత్తం మీద మోడీ మెలికల మీద మెలికలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారన్నమాట.
