మోడీ దృష్టంతా ఇక దీనిపైనే...?

రాజస్థాన్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ శ్రేణుల అంతర్మధనంలో పడ్డాయి. మోడీ హవా తగ్గిందంటున్న వారికి కర్ణాటక ఎన్నికల ద్వారా రుజువు చేయాలన్నది కమలనాధుల ప్రయత్నం. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన ప్రధాని మోడీ కర్ణాటకలో పర్యటించనున్నారు. బెంగళూరులో జరిగే బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. ఇందుకోసం కర్ణాటక బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే వారం రోజుల క్రితం అమిత్ షా కర్ణాటకలో పర్యటించారు. ఈ సభకు కనీసం మూడు లక్షల మందిని సమీకరించాలని కమలనాధులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ బహిరంగ సభ యడ్యూరప్ప ప్రారంభించిన నవ కర్ణాటక పరివర్తన యాత్ర ముగింపు సభగా నామకరణం చేశారు.
ఈ నెల 4న సభ...
మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇప్పటికే కర్ణాటక నవ కర్ణాటక పరివర్తన యాత్రను చేశారు. 84 రోజుల పాటు రాష్ట్రంలో యడ్యూరప్ప పర్యటించారు. కర్ణాటకలోని 30 జిల్లాల్లో 224 శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన ఈ యాత్రను చేశారు. మొత్తం 10,500 కిలోమీటర్లు యడ్యూరప్ప పర్యటించారు. యడ్యూరప్ప యాత్రకు మంచి స్పందన లభించడంతో కమలనాధులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలతో డీలా పడిన పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం తెచ్చేందుకు మోడీ సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ నెల4న జరిగే ఈబహిరంగ సభ విజయవంతం అవుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అదే రోజు కర్ణాటక బంద్....
అయితే అదే రోజు కర్ణాటక బంద్ జరగనుంది. మహదాయి నదీ జలాల్లో వాటా ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కళాసా, బండూరి నాళ పోరాట సమితి ఈ నెల 4వ తేదీన కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చింది. అయితే అదే రోజు ప్రధాని మోడీ బహిరంగ సభ ఉండటంతో కమలనాధులకు ఇబ్బందిగా మారింది. కన్నడ నాట బంద్ ను ఆ సంస్థ సీరియస్ గానే తీసుకుంది. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం పది మంది బీజీపీ నేతలు ఈ సభ ఏర్పాట్లను చూస్తున్నారు. బంద్ కావడంతో ఆర్టీసీ బస్సులు అవకాశం లేదు. దీంతో ప్రయివేటు బస్సుల్లో రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలను సభకు తరలించాలని యడ్యూరప్ప నిర్ణయించారు. కొందరిని రైళ్లల్లో రప్పించే ఏర్పాట్లుచేస్తున్నారు. ఎన్నికలకు ముందు జరిగే అతి పెద్ద బహిరంగ సభగా బీజేపీ నేతలు భావిస్తుండటంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభను విజయవంతం చేయడానికి ముందస్తుగా రాష్ట్ర వ్యాప్తంగా మోటారు సైకిళ్ల ర్యాలీలు, రాత్రివేళ కాగడాల ప్రదర్శనలను బీజేపీ నేతలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక బంద్ నేపథ్యంలో మోడీ రాక పోలీసులకు తలనొప్పిగానే తయారైంది.

