మోడీ గాలిపై టీడీపీ అంచనా ఇదేనా?

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి తో పొత్తు వుండకపోవొచ్చన్న తీరులోనే ఇప్పటివరకు టిడిపి అడుగులు పడుతూ వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని జనంలోకి పోవాలన్న ఆలోచనతోనే తెలుగుదేశం వ్యూహం నిన్నటివరకు సాగింది. అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో కమల విజయంతో మోడీ హవా స్టడీ చేసేందుకు మరికొంత కాలం వేచి చూసే ధోరణి తో సాగాలన్నది పసుపు దళపతి ప్లాన్ గా ఉందంటున్నాయి విశ్లేషణలు. సాధారణంగా చివరి నిమిషం వరకు ఆచితూచి వ్యూహాన్ని అమలు చేయడం పొత్తులు ఖరారు చేసుకోవడం చంద్రబాబు కి వెన్నతో పెట్టిన విద్య. గతంలో 99 ఎన్నికల్లో వాజపేయి హవాను గమనించి పొత్తు తో ప్రత్యర్థులను చిత్తు చేశారు. తిరిగి అధికారంలోకి వచ్చేశారు. 2004 ఎన్నికల్లో అదే బిజెపి ని దూరం పెట్టారు. కమలానికి గాలి లేదని గ్రహించి గుజరాత్ నరమేధంతో మైనార్టీలు దూరం అవుతారని భయపడి బాబు మిత్రపక్షాన్ని శత్రుపక్షంగా దూరం పెట్టేశారు. ఆ నిర్ణయం ఇరు పార్టీలను దెబ్బ కొట్టింది.
పదేళ్ల తర్వాత కమలాన్ని దగ్గర చేసుకున్న బాబు ......
2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ హవా ముందే పసిగట్టిన చంద్రబాబు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు వద్దు వద్దన్నా మొత్తానికి ఆ పార్టీ తో జత కట్టి కాషాయ దళం గాలిని పూర్తిగా ఆస్వాదించి అధికారం అందుకున్నారు. విభజన తరువాత వైసిపి కి వైఎస్ మరణం ద్వారా వచ్చిన సానుభూతి వేవ్ ను బాబు సమర్ధంగా తిప్పికొట్టారు. ఇలా ఎప్పటికప్పుడు బిజెపిని ఎక్కడ వాడుకోవాలో ఎక్కడ వదిలేసుకోవాలో చంద్రుడికి తెలిసినంతగా మరొకరికి తెలియదు.ఇప్పుడు ముందస్తు ఎన్నికలు సందేహంగా వున్న ఈ దశలో చివరిక్షణం వరకు వేచి చూసి మోడీ హవా ఉందో? లేదో నిర్ధారించుకునే ముందుకు పోదామని చెబుతున్నారట బాబు. ఈ నేపథ్యంలోనే తొందరపాటుగా పొత్తు అంశంపై ఇప్పుడే ఆలోచన చేసేయడం సరికాదని గుజరాత్ ఫలితాలపై బాబు సన్నిహితుల దగ్గర చేసిన వ్యాఖ్యానాలే తేటతెల్లం చేస్తున్నాయి.
- Tags
- మోడీ చంద్రబాబు

