మోడీ ఎప్పుడు తలచుకుంటే అప్పుడే...!

లోక్ సభ శీతాకాల సమావేశాలు ఎప్పుడు జరగుతాయి. డిసెంబర్ 11 నుంచి 14వ తేదీల మధ్య ఏదో ఒక రోజు సమావేశాలు ప్రారంభమవుతాయని పార్లమెంటు వర్గాలు తెలుపుతున్నాయి. కాని ఇంతవరకూ నోటిఫికేషన్ విడుదల కాలేదు. పార్లమెంటు సమావేశాలకు పదిహేను రోజుల ముందు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. పార్లమెంటు సభ్యులు దేశంలో ఎక్కడ ఉన్నా సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా ఈ వెసులు బాటును కల్పించారు. సమావేశాలకు పదిహేను రోజుల ముందు విధిగా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. మామూలుగా ప్రతి ఏడాది నవంబర్ నెల మూడో వారంలో పార్లమెంటుశీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే నోటిఫికేషన్ విడుల కాకపోవడంతో ఈ నెలలో జరిగే అవాకాశం లేదు. దీనిపై విపక్షాలు కూడా బీజేపీని గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి.
నిబంధలను అంగీకరిస్తున్నా....
అయితే గుజరాత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే పార్లమెంటు శీతాకాల సమావేశాలను మోడీ వాయిదా వేస్తూ వస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. గుజరాత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ దాదాపు 30 సభల్లో ప్రసంగించాల్సి ఉంది. ఇక కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా గుజరాత్ ప్రచారంలో ఇప్పటికే బిజీగా ఉన్నారు. దీంతో ప్రధాని మోడీ డిసెంబర్ రెండో వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరపాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆరునెలలకు ఒకసారి విధిగా పార్లమెంటు సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీతో పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. అంటే ఆరునెలల సమయం తీసుకుంటే ఫిబ్రవరి నెల వరకూ పార్లమెంటు సమావేశాలు నిర్వహించుకునే వీలుంది. అయితే వెంటనే బడ్జెట్ సమావేశాలు వస్తాయి. దీంతో కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలన్నీ శీతాకాల సమావేశాలను వెంటనే పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే గుజరాత్ ఎన్నికలు వచ్చే నెల9,14 వతేదీల్లో జరుగుతుండటంతో డిసెంబర్ రెండో వారంలో కాని ప్రారంభం కావని పార్లమెంటు వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది.

