మొన్నటి సిటీకి...నేటి హైదరాబాద్ కు ఎంత తేడా?

హైదరాబాద్ సిటీ కాప్స్... ఈ ఏడాది ప్రవంచస్థాయిలో గుర్తింపు పొందింది. ఏకంగా ఆరు ఆవార్డులు కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్ర కమిషనరేట్ లలో తనదైన ముద్రవేసుకుంది. అంతేకాదు నేర నియంత్రణలో కమ్యూనిటీ సిసి టివిల విధానంలో కూడా ముందుంది. ఈ కమిషనరేటే. సిసిల ద్వారా ఏకంగా మూడువేల 256 కేసులను క్షణాల్లో ఛేదించారు. క్రైం రేట్స్ ను సైతం తగ్గించి సిఎం మన్ననలు పొందారు. 2017 హైదరాబాద్ క్రైం రేట్స్ పై ఓ రివ్యూ....
గతంలో ఇలా....
హైదరాబాద్.. ఈ పేరు ప్రపంచ దేశాల్లో ఎంతో సుపరిచితం.. టూరిస్టు ప్లేస్ లో కూడా సిటీకి తనదైన గుర్తింపు ఉంది. అందుకే ఇండియాకు వచ్చే విదేశీ అతిధులు హైదరాబాద్ చూడకుండా తిరక్కుండా తిరిగి వెళ్లరు.. అంత ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాంతం రాను రాను హై డర్ బాద్ గా మారిపోయింది. ఎక్కడ ఏ ఘోరం జరిగినా వాటి మూలాలు ఇక్కడే బయటపడేవి. బాంబు బ్లాస్ట్ లు, మతకల్లోలాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు ప్రవేశపెట్టిన విధానాలు. పని తీరు ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడేలా చేస్తోంది.
గతానికి భిన్నంగా....
60లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీలో నేరాల సంఖ్య అంతకు రెండింతలు ఉండేవి.. రోజుకో రేప్.. గంటకో హత్య... నిమిషానికో దోపిడీలు చోటు చేసుకునేవి. అలాంటిది 2017 సంవత్సరంలో క్రైం రేట్స్ తగ్గించుకొని హైడర్ బాద్ రికార్డు తిరగేసి మరోసారి పాత పేరు తెచ్చేలా చేసింది. అందుకు కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన చేయుత.. నేరాల నియంత్రణలో జనం భాగస్వామ్యమే అంటున్నారు. పోలీసులు. జనం కోసం తీసుకున్న అనేక సంస్కరణలు, మొబైల్ యాప్ లు ఎంతో ఉపయోగపడ్డాయని చెబుతున్నారు. హాక్ ఐ ఈ ఒక్క యాప్ లో ఆరు లక్షల మంది జనం సభ్యులుగా చేరారు అంటే పోలీస్ చేసే కార్యక్రమాలకు ప్రజలకు ఎంత చేరువవుతాయో ఇట్టే అర్థమౌతుందని అన్నారు సిటీ పోలీస్ బాస్ శ్రీనివాసరావు.
సీసీ కెమెరాల ద్వారా...
2017లో భారత దేశంలో ఎక్కడ లేనంత విధంగా కొత్తగా లక్షా 6వేల 315 సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న సిసి కెమెరాల ద్వారా మూడువేల 256 కేసులను ఇట్టే చేధించారు. అంతే కాదు హత్యలు 26శాతం. చైన్ స్నాచింగ్ లు 47శాతం తగ్గాయి. ఈ సంవత్సరం 53 మంది నేరస్తులపై పిడి యాక్టు ప్రయోగించి వారు జీవితాంతం జైలులోనే ఉండేలా చర్యలు తీసుకున్నారు సిటీ పోలీసులు. 3676 మంది అంతర్ రాష్ట్ర నేరగాళ్లతో పాటు, 450 గన్ లైసెన్సులకు జీయో ట్యాగింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఇక సిటీ పోలీసులతో టాప్ లిస్టులో ఉన్న షీటీమ్స్ ఈ ఏడాది అదిరిపోయే రేంజ్ లో పని చేసింది. 644 మంది ఆకతాయిల భరతం పట్టి వారిలో 36 మందిపై నిర్భయ యాక్టు పెట్టి ఊచలు లెక్కించేలా చేసింది. సిటీని వణికించే డ్రగ్స్ దందాపై కూడా పోలీసులు దాడులు చేసి ఈ ఏడాది 142 మందిని అరెస్టు చేశారు. 15 జాబ్ రాకెట్ కేసుల్లో 20 మంది, క్రికెట్ బెట్టింగ్ లో 88 మంది, కల్తీ రాకెట్ లో 70 మందిని అరెస్టు చేశారు. ఇక డిమానిటైజేషన్ కరెన్సీ విషయంలో 71 మందిని అరెస్టు చేసి 32 కోట్ల 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లోనూ....
మందుబాబులకో వణుకు పుట్టించే డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2017లో పోలీసులు నమోదు చేసిన కేసులు 17వేల 265. అందులో 3,803 మందికి జైలు శిక్ష పడితే.. మిగతా వాహన చోదకుల నుండి రెండు కోట్ల 16 లక్షల 28వేలు వసూలు చేశారు. టెక్నాలజీతో ముందుకు దూసుకు పోయిన సిటీ కాప్స్ కి ఆరు ఆవార్డులు దక్కాయి.మొత్తానికి సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకు పోతున్న తమకు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతగానో ఉందని చెబుతున్నారు. పోలీసులు లక్షల్లో జనాభా ఉన్నా కేసులు మాత్రం పదుల్లో ఉన్నాయని, ఫిర్యాదు చేసిన నాలుగు నిమిషాల్లోనే సదరు అధికారి స్పందన ఉండటం శాంతి భద్రతల పరిక్షణలో తమ పని తనం ఎంత ఉందో అర్థమౌతుందంటున్నారు పోలీస్ బాస్ లు . భవిష్యత్తులో జనాలకు ఉపయోగపడేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ముందుకు దూసుకుపోతామని వెల్లడించారు.
- Tags
- సిటీ పోలీసులు

