మైనింగ్‌లో అక్రమార్కుల లీలలకు చెక్

ఇబ్బడి ముబ్బడిగా ఆర్జనకు అవకాశం ఉండే మైనింగ్ వ్యవహారంలో అక్రమమార్గాలు అనుసరించే వారికి చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబునాయుడు ఈ మేరకు కొత్త నిర్ణయాలతో.. బినామీల వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మైనింగ్ కోసం లీజుకు తీసుకున్న క్వారీలను వేరొకరికి బదిలీ చేయడాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనింగ్ లీజుల బదిలీలతో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని భావించిన ముఖ్యమంత్రి అనుబంధ పరిశ్రమలు వున్న క్వారీలను మాత్రమే బదలాయించుకునేందుకే అనుమతివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 20 ఏళ్లుగా వున్న మైనింగ్ లీజు కాలాన్ని అనుబంధ పరిశ్రమలు పెడితే 30 ఏళ్లకు పెంచాలని సూచించారు.
మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి సిరామిక్, గాజు పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రంలో మరో రెండు పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. దీంతో సిరామిక్, గాజు పరిశ్రమల అభివృద్ధికి చిత్తూరు జిల్లాలో సిరామిక్ క్లస్టర్, ఓర్వకల్లులో గ్లాస్-సిలికా క్లస్టర్ ఏర్పాటు కానుంది. అలాగే కృష్ణాజిల్లా మల్లవల్లిలోనూ సిరామిక్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.
గ్రానైట్ మైనింగ్ సీనరేజ్, డీఎంఎఫ్ (డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్) రాయల్టీలు భారంగా మారాయని ఇటీవల గనుల శాఖకు విజ్ఞాపనలు రావడంతో, పొరుగు రాష్ట్రాల్లో ఎంతమేర వసూలు చేస్తున్నారో అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్వారీల తవ్వకాలతో ప్రత్యక్షంగా ప్రభావం పడే పరిధిని 10 కి.మీ. గా, పరోక్షంగా ప్రభావం పడే పరిధిని 25 కి.మీ. గా నిర్ణయించిన ముఖ్యమంత్రి ఈ ప్రాంతాలను డీఎంఎఫ్ నిధులతో త్వరితగతిన అభివృద్ధి చేయాలని చెప్పారు. 5 వేల చదరపు అడుగులకు మించి భవనాలు నిర్మించే యజమానుల నుంచి చదరపు అడుగుకు రూ. 3 చొప్పున గ్రీన్ ఫీజు వసూలు చేయాలని సమీక్షలో నిర్ణయించారు.
ఒప్పందంలో పేర్కొన్నట్టు సిమెంట్ ప్లాంట్లు నెలకొల్పని కారణంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో గతంలో కేటాయించిన లైమ్‌స్టోన్ బ్లాకుల లీజును రద్దు చేశామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాలో కొత్తగా మరో నాలుగు లైమ్‌స్టోన్ బ్లాకులను గుర్తించామని తెలిపారు. విజయనగరం జిల్లాలోని పాచిపెంటలో ఇనుప ఖనిజం కోసం అన్వేషిస్తున్నామని, కడప-గుంటూరు జిల్లాల్లో లెడ్, జింక్, కాపర్ వనరులు వున్నాయని తెలిపారు.
మైనర్ మైనింగ్ లీజుకు పొరుగు రాష్ట్రాల్లో అవలంభిస్తున్నట్టుగా వేలం విధానం ప్రవేశ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, కేటాయింపుల్లో పారదర్శకత సాధ్యమవుతుందని అధికారులు వివరించగా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
20% పెరిగిన ఆదాయం
మైనింగ్ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 20% అధికంగా వసూలైంది. ఈ ఏడు నెలల్లో గనుల శాఖకు రూ. 859 కోట్ల మేర ఆదాయం సమకూరింది. లక్ష్యం రూ. 853 కోట్ల కన్నా రూ. 6 కోట్లు అధికంగా ఆదాయం రావడం గమనర్హం. ఇందులో బిల్డింగ్ మెటీరియల్, గ్రానైట్ వంటి మైనర్ మైనింగ్ ఆదాయం రూ. 502 కోట్లు కాగా, లైమ్‌స్టోన్, ఆయిల్-గ్యాస్ తదితర మేజర్ మైనింగ్ ఆదాయం రూ. 357 కోట్లు వుంది. అయితే నోట్ల రద్దు కారణంగా మూడు, నాలుగు త్రైమాసికాల్లో అనుకున్న లక్ష్యం కన్నా ఆదాయం కొంతవరకు తగ్గొచ్చని అధికారులు అంచనా వేశారు.

