మేఘాలయలో ఎప్పటికైనా ముప్పుతప్పదా?

ఉన్న ఆ ఒక్క రాష్ట్రం కూడా పోయింది. ఇటీవల ఈశాన్యంలో జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో నాగాలాండ్, త్రిపురలో కాంగ్రెస్ పార్టీ బోణీ కూడా కొట్టలేదు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే మేఘాలయలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నిన్న మొన్నటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 21 స్థానాలు సాధించి పెద్ద పార్టీగా ఉంది. అదే సయంలో నేషనల్ పీపుల్స్ పార్టీ 19 సీట్లతో రెండో స్థానంలో ఉంది. బీజేపీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. వీరితో పాటు యునైటెడ్ డెమొక్రటిక్ అలయన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, ఒక స్వతంత్ర సభ్యుడితో కలిసి మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు.....
మేఘాలయలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నమే చేసింది. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్ కమల్ నాధ్ లు అక్కడే మకాం వేసి ఇతర పార్టీల నేతలతో చర్చలు జరిపారు. అయితే స్వతంత్రులు, ఇతర పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీవైపే మొగ్గు చూపాయి. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి ఉంటే మేఘాలయకు అత్యధికంగా నిధులు వస్తాయని కమలం పార్టీతో ప్రాంతీయ పార్టీలు జతకట్టాయి. మేఘాలయ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లుకూడా వార్తలు వచ్చాయి.
రెండే సీట్లున్న బీజేపీ.....
కేవలం రెండే సీట్లున్న బీజేపీ ఈ రాష్ట్రాన్ని కూడా ఒకరకంగా హస్తగతం చేసుకుంది. ఇక్కడ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. మూడు ప్రాంతీయ పార్టీలతో కలిపి బీజేపీ ఇక్కడ అధికారాన్ని తెచ్చుకుంది. అంటే నేరుగా బీజేపీ అధికారంలో లేకపోయినా పరోక్షంగా మేఘాలయను కూడా తమ ఖాతాలోనే వేసుకున్నట్లయింది. అయితే ఇప్పుడు కలిసిన ఏ పార్టీ అయినా ప్రభుత్వం నుంచి వైదొలిగితే సర్కార్ కూలిపోక తప్పదు. అందుకనే ఈ ప్రభుత్వం ఎప్పుడుకూలిపోతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి అంటున్నారు విశ్లేషకులు.
విభిన్న వైఖరులున్న పార్టీలతో కలిసి....
మేఘాలయలో ఏ ప్రభుత్వం ఉన్నా కుదురుగా పాలన సాగించలేని పరిస్థితి. ప్రభుత్వంలో బీజేపీ ఉన్నందున ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పులేకున్నా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రస్తుతం కూటమిగా ఏర్పడిన పార్టీలు యునైటెడ్ డెమొక్రటిక్ అలయన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలు ప్రత్యేక ఖాసీ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న పార్టీలు కావడం గమనార్హం. ఈ కూటమిలోని పార్టీలన్నీ విభిన్న వైఖరులతో కూడుకున్నవి కావడంతో పూర్తికాలం అధికారంలో కొనసాగుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే.
- Tags
- మేఘాలయ
