మెట్రోలో ఇవి చేయకూడదట....!

మెట్రో రైలు పరుగు ప్రారంభం కావడంతో ప్రయాణికుల కోసం ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవాలనే అంశంపై నగర పోలీసులు పరిశీలన జరిపారు. మెట్రో రైల్లో ఎవరైనా అకతాయిలు ఇబ్బందులకు గురిచేస్తే అందులో ఉండే ఎమర్జెన్సీ బటన్ ను నొక్కాలని పోలీసులు సూచిస్తున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 24 మెట్రో స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం మెట్రో రైలు పరుగులు తీస్తుంది. ఇప్పటికే ఒకో మెట్రో స్టేష న్ కు ఒక ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు. అయితే మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని చర్యలు తీసుకునేందుకు పోలీసులు హైదరాబాద్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు మెట్రో రైల్లో నార్త్ జోన్ డీసీపీ సుమతి ప్రయాణించి మరిన్ని ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే అంశంపై ఆరా తీశారు.
మందుబాబులను కట్టడి చేసేందుకు....
మందుబాబులను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమాలోచన చేస్తున్నారు. ఈ విషయంపై చర్చించినట్లు తెలిసింది. మరో పక్క షీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ప్రతి స్టేషన్లో షీ టీమ్స్ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. సురక్షిత ప్రయాణం కోసం.. మెట్రో రైళ్లు మొదటి రోజు ప్రయాణీకుల రద్దీతో నడిచాయి. నార్త్ జోన్ డీసీపీ సుమతి మెట్రో రైలులో కొద్దిసేపు ప్రయాణించి పరిస్థితిని సమీక్షించారు. మరో వారం రోజుల పాటు ఈ పరిశీలన కొనసాగుతుందన్నారు. మెట్రో రైల్లో భద్రతపరమైన ఎలాంటి చర్యలు ఉన్నాయి. మెట్రో స్టేషన్ కు వచ్చినప్పటి నుంచి రైల్లోకి ఎక్కేవరకు, రైల్లో ఎక్కిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు ప్రయాణికులు తీసుకోవాలి? మెట్రో తరపున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోలీసుల తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై పరిశీలన జరుపుతామన్నారు. ప్రయాణికులు సెల్ఫీలు, సెల్ ఫోన్లు వాడటంపై దృష్టి పెట్టడంతో అనుకోకుండా జారి ప్లాట్ ఫాం పడే అవకాశాలు, సెల్ ఫోన్లు పడిపోతే వాటి కోసం ప్రయత్నంలో ఏమైనా ప్రమాదాలు, రెండు ట్రాక్ లు ఉండడంతో మరో పక్క కూడా డోర్ తెరుచుకునే అవకాశాలు ఉన్నాయా? అనే తదితర అంశాలపై సూక్ష్మంగా పరిశీలించిన తరువాత పూర్తిస్ధాయిలో చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మెట్రో రైలు ప్రమాదాలు, అందుకు గల కారణాలు తీసుకొని, ఇక్కడ అలాంటి వాటికి ఏమైనా అవకాశాలున్నాయా అనే విషయాలపై పరిశీలన జరుపుతున్నామని డీసీపీ తెలిపారు.
సెక్యూరిటీ నిఘా....
మెట్రో ఆవరణలో ఆకతాయి పనులు చేసే వారిపై పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ నిఘా ఉంటుంది. అయితే మెట్రో రైల్లో ఆకతాయి పనులు చేస్తే ఎలా అనే ప్రశ్న అందరిలో వస్తుంది. తోటి ప్రయాణికులను, మహిళను ఇబ్బందులకు గురిచేస్తే కోచ్ లోపల బటన్ను ఎమర్జెన్సీ కోసం వాడుకోవచ్చు. ఈ బటన్ను నొక్కితే.. వెంటనే తరువాత స్టేషన్లో సిబ్బంది వచ్చి ఆకతాయిలను పట్టుకొని స్టేషన్లో ఉన్న సిబ్బందికి అప్పగిస్తారు. మద్యం సేవించి వచ్చే వారిని నిలువరించేందుకు ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అయితే అలాంటి వారు బోగిలలోకి ఎక్కిన తరువాత ఏదైనా ఆకతాయి పనిచేస్తే బాధితులు వెంటనే బటన్ నొక్కితే వారిని తరువాతి స్టేషన్లో అరెస్ట్ చేస్తామంటూ మెట్రో సెక్యూరిటీ ఆఫీసర్ అదనపు ఎస్పీ ఆనంద్ భాస్కర్ తెలిపారు.
- Tags
- మెట్రో

