మెట్రో ఎక్కితే ఎంతో తెలుసా?

హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభానికి రెడీ అవుతోంది. ఈ నెల 28వ తేదీ సాయంత్రం మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారు. అయితే మెట్రో రైలు టిక్కెట్ ధరలపై ఇంతవరకూ ఒక క్లారిటీ రాలేదు. హైదరాబాద్ లో మెట్రో రైలు నిర్మాణం ఆరేళ్లుగా సాగుతోంది. ఎల్ అండ్ టీ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తీసుకుంది. అయితే అనుకున్న దానికంటే ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయింది. తొలుత మెట్రో రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం 14,450 కోట్లు కాగా ఇప్పుడు అది 18 వేల కోట్లకు చేరుకుంది. దీనిపై ఎల్ అండ్ టీ సంస్థ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. అదనంగా పడిన భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఎల్ అండ్ టీ కోరుతుండగా, ప్రభుత్వం మాత్రం దీనికి అంగీకరించడం లేదు.
ఛార్జీల మోత తప్పేట్లు లేదు....
మెట్రో రైలు ప్రాజెక్టును 30ఏళ్లు నడుపుకోవడానికి ఎల్ అండ్ టీ సంస్థకు అనుమతి ఉంది. ఎల్ అండ్ టికి ముఖ్యమైన ప్రాంతాల్లో స్థలాలను కేటాయించారు. ఇక్కడ షాపింగ్ మాల్స్ ఎల్ అండ్ టి నిర్మించనుంది. దాని ద్వారా కూడా ఆదాయం రానుంది. అయితే మెట్రో రైలు టిక్కెట్ల ద్వారా 45 శాతం ఆదాయం రావాల్సి ఉంది. ఇందుకోసం టిక్కెట్ల ధరలపై కసరత్తులు చేస్తున్నారు. సాధారణ టిక్కెట్ పది రూపాయలు, కనీస టిక్కెట్ 70 రూపాయలుగా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీలో మెట్రో రైలు ఛార్జీలు చాలా స్వల్పంగానే ఉన్నాయి. జైపూర్ సిటీలో మాత్రం పీక్ అవర్స్, నాన్ పీక్ అవర్స్ అని వేర్వేరు పద్ధతుల్లో టిక్కెట్లు వసూలు చేస్తున్నారు. దీంతో మెట్రో రైలు టిక్కెట్ ధరల నిర్ణయంపై ఇంకా ఆలోచనలోనే ఉంది. అయితే తొలుత ధరలను నిర్ణయించి ఆక్యుపెన్సీ రేటు ప్రకారం ఛార్జీలను పెంచవచ్చని ఎల్ అండ్ టి యోచిస్తోంది.
- Tags
- మెట్రో రైలు

