మూడో అభ్యర్థి లేనట్లేనా?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని బరిలోకి దింపడంపై పునరాలోచనలో పడింది. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సంఖ్యాబలం ప్రకారం రాజ్యసభ ఎన్నికల్లో రెండు సీట్లను టీడపీ, ఒక సీటు వైసీపీ సులువుగా గెలుచుకునే అవకాశముంది. అయితే మూడో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు చంద్రబాబుకు సూచించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉంటే మూడో అభ్యర్థిని సులువుగా గెలిపించుకోవచ్చన్నది టీడీపీలో కొందరి ఆలోచన.
బీజేపీ మద్దతిస్తుందా?
అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి తీసుకువచ్చినా బీజేపీ ఎమ్మెల్యేలు నలుగురు తమకు ఓటేస్తారన్న గ్యారంటీ టీడీపీకి లేదు. ఇప్పటికే బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం మళ్లీ ప్రారంభమయింది. చంద్రబాబు సయితం బీజేపీ పొత్తుతో తమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కామెంట్స్ చేశాక బీజేపీ రాజ్యసభ ఎన్నికల్లో తమకు మద్దతిస్తుందని టీడీపీ భావించడంలేదు. దీంతో చంద్రబాబు ముఖ్యనేతలతో సమావేశమై రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. రెండుస్థానాలకే ఈరోజు కాని, రేపు కాని అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
చంద్రబాబు సీనియర్ నేతలతో....
చంద్రబాబు మంత్రులు యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావులతో సమావేశమయ్యారు. తొలుత పొలిట్ బ్యూరోలో చర్చించాలని భావించిన సీఎం రేపటి సమావేశాన్ని రద్దు చేశారు. ఆశావహుల జాబితాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, వర్ల రామయ్య తదితరుల పేర్లను సీఎం పరిశీలిస్తున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. సామాజిక వర్గాల కోణంలోనూ సీఎం ఆలోచించి అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెబుతున్నారు.
రేపు బీజేపీ కోర్ కమిటీ సమావేశం.....
అయితే ఇదే సమయంలో రేపు బీజేపీ కోర్ కమిటీ సమావేశం అవుతుంది. దీనికి బీజేపీ జాతీయ నేత సతీష్ జీ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలందాయి. కేంద్ర నాయకత్వం సూచన మేరకు ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై బీజేపీ నేతలు చర్చించనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఎవరికి మద్దతు ప్రకటించనుందో రేపు తేలనుంది. అయితే టీడీపీ ఇప్పటికీ ఎన్డీఏలో కలిసి ఉంది కాబట్టి ఆ పార్టీకే మద్దతివ్వాలని కొందరి వాదన. అయితే రాజ్యసభ ఎన్నికల కోసమే టీడీపీ ఎన్డీఏ కొనసాగుతుందని, ఎన్నికలు పూర్తయిన తర్వాత టీడీపీ వైదొలుగుతుందని కొందరు బీజేపీ నేతలు అధిష్టానానికి గట్టిగా చెబుతున్నారు. దీనిపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
- Tags
- రాజ్యసభ ఎన్నికలు
