ములాయం నిర్ణయం ఎలా ఉంటుందో?

అఖిలేష్ యాదవ్ దూకుడు పెంచారు. తండ్రిని మరోసారి పక్కన పెట్టేశారు. ఆయనే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ప్రకటించుకున్నారు. ఈరోజు ఆగ్రాలో జరిగిన సమాజ్ వాదీ పార్టీ జాతీయ సదస్సులో జరిగిన ఎన్నికలో ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ ను జాతీయ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించి తాను ఆ పదవి చేపట్టారు. దీంతో తండ్రి,కొడుకుల మధ్య వివాదం మరింత ముదిరింది. అయితే ఎన్నికల సమయానికి అంతా సర్దుకున్నట్లే కన్పించింది. ములాయం సింగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎస్పీ తరుపున ప్రచారం చేశారు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం ముగిసినట్లేనని అందరూ భావించారు.
మరోసారి జాతీయ అధ్యక్షుడిగా......
ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరుకావాలని అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ ను స్వయంగా ఆహ్వానించారు. కాని ఈ సమావేశానికి ములాయం సింగ్ హాజరుకాలేదు. పైగా ములాయం సింగ్ మరో తమ్ముడు రాంగోపాల్ యాదవ్ 2019 లోక్ సభ, 2022 శాసనసభ ఎన్నికలకు అఖిలేష్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వాస్తవానికి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడి పదవి మూడేళ్ల కాలం ఉంటుంది. కాని ఈరోజు పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు. పదవీకాలాన్ని ఐదేళ్ల పాటు పొడిగించారు. అయితే అఖిలేష్ మాత్రం ఫోన్లో ములయాం సింగ్ తనను ఆశీర్వదించారని చెప్పారు. మరో బాబాయి శిపపాల్ యాదవ్ ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయన్నారు. ములాయం సింగ్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా సాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ములాయం ఏం నిర్ణయం తీసుకుంటారో మరి.

