ముద్రగడ మళ్లీ మొదలుపెట్టారే....!

చంద్రబాబు కు నిద్ర లేకుండా చేయడమే తన ప్రధాన ఎజెండా గా పెట్టుకున్న మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొత్త వ్యూహం అమల్లో బిజీ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి లోని కాపుల వీధిలో అంబేద్కర్ స్మారక మందిరం స్థాపించి విగ్రహాన్ని నెలకొల్పి ప్రారంభం అట్టహాసంగా చేశారు పద్మనాభం. వేలాదిమంది కాపులు దళితులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ముద్రగడ కు మద్దత్తు పలకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్, అమలాపురం మాజీ ఎంపీ జివి హర్షకుమార్ ముఖ్య అతిధులుగా పాల్గొనడం వారంతా అంబేద్కర్ వారసుడు ముద్రగడ అంటూ ప్రశంసలు జల్లు కురిపించడం అందుకు ప్రతిగా తన జీవితాంతం దళితులతో ఉంటా అని పద్మనాభం ప్రకటించడం చక చకా జరిగిపోయాయి.
ఉప్పు నిప్పులు ఒకటి అవుతాయా ...?
సామాజిక చైతన్యానికి కులాలు అన్ని సమానమే అని చాటి చెప్పేందుకు ముద్రగడ, హర్ష కుమార్ చేసిన ప్రయత్నం మంచిదే. కానీ కోస్తాలో కాపులకు దళితులకు గ్రామాల్లో ఉప్పు నిప్పు వ్యవహారమే చాలా చోట్ల ఇప్పటికి నడుస్తుంది. దళితులపై దాడుల సంఘటనల్లో ఎక్కువమంది కాపు సామాజిక వర్గీయులే కనిపిస్తారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అనేక గ్రామాల్లో పెత్తందార్లు కాపు సామాజిక వర్గీయులే. వీరివద్ద కూలి నాలి చేసుకుంటున్న దళితులపై ఏదో ఒక ప్రాంతంలో దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయనడానికి పోలీస్ స్టేషన్లలో నమోదు అయ్యే కేసులే నిదర్శనం. ఇక కోనసీమ లాంటి చోట్ల హత్యలు దాడులు తీవ్రంగా సాగడం కొన్ని సందర్భాల్లో కర్ఫ్యూ పెట్టే తీవ్రత నెలకొని ఉండేది.
వ్యాక్యూమ్ ఉందా ...?
ఏపీలో రాజకీయాలు కులాల కురుక్షేత్రం గానే నడుస్తాయి. ఆది నుంచి కులాల వారీగా రాజకీయ పార్టీలు విభజిస్తూ పాలిస్తూ వస్తున్నాయి. ఒక పక్క టిడిపి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పూర్తిగా వాడుకుని కాపుల మెజారిటీ ఓటు బ్యాంక్ సాధించి అధికారం హస్త గతం చేసుకుంది. ఇక గత ఎన్నికల్లో దళితులు రాష్ట్ర విభజన నేపథ్యంలో తమ సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీకి చెయ్యిచ్చి వైసిపి వైపు నిలబడ్డారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్ధం అయితే కాపులు మెజారిటీ వర్గం టిడిపికి దూరం అవుతుందన్న అంచనాలు వున్నాయి. కానీ దళిత ఓటు బ్యాంక్ వైసిపి కి చెక్కు చెదరలేదన్నది విశ్లేషకుల లెక్క. ఈ నేపథ్యంలో ముద్రగడ, హర్ష కుమార్ జత కట్టి రెండు కులాలను చైతన్య పరిచి అధికారం సాధించేంత సత్తా చూపగలగాలి అంటే వారిద్దరు సొంత పార్టీ పెట్టాలి. ఆ పార్టీకి ఈ రెండు సామాజిక వర్గాల వారు ఏ మేరకు సంయుక్తంగా సంఘీభావం ప్రకటిస్తారన్నది ఇప్పుడే ఎవరు చెప్పలేని పరిస్థితి.
రాజకీయ అవసరాన్ని గుర్తించిన రెండు కులాలు ...
కాపులు దళితులు కలిసి ఐక్యంగా నడిస్తే రాజ్యాధికారం సాధ్యమనే లెక్కలు పొలిటికల్ సర్కిల్ లో వున్న ఆయా సామాజిక వర్గీయులు తేల్చింది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి విఫలం అయ్యాకా రెండు కులాలు ఈ చారిత్రక అవసరాన్ని గుర్తించాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విఫల ప్రయోగం చేసిన సమైఖ్యఆంధ్ర పార్టీలో సైతం హర్షకుమార్ కీలక భూమిక వహించిన అనుభవం వుంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో అత్యధికంగా మాల సామాజికవర్గం, కాపు సామాజిక వర్గీయులు వున్నారని ఈ రెండు కులాల కలయికతో సాధ్యం కానిది ఏది లేదన్నది ఆయా కులాలకు సారధ్యం వహిస్తున్న మేధావులు, నేతల అంచనా. ఆ దిశగా గత మూడేళ్ళుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు మాజీ ఎంపీ హర్షకుమార్. కాపు ఉద్యమ నేపథ్యంలో ముద్రగడ చేపట్టే ప్రతి ఆందోళనకు హర్ష మద్దత్తు ఇస్తూ వచ్చారు. కాపులు దళితులను ఐక్యం చేసేందుకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణే ఇరు కులాల కు సూచనగా నిలుస్తుందని ఇదే విధానం రాష్ట్రవ్యాప్తంగా ఇరువురు అమలు చేయాలని సుదీర్ఘ కార్యాచరణ రూపొందించారు హర్ష కుమార్, ముద్రగడ. ఇప్పుడు కిర్లంపూడి తో ప్రారంభం అయిన ఈ ప్రస్థానం ఏ దిశగా నడుస్తుందో వారి కలలు ఫలిస్తాయో లేదో చూడాలి.
- Tags
- ముద్రగడ

