ముద్దు డిమాండ్‌ను కేసీఆర్ పరిశీలిస్తారా?

ఏపీ తెలుగుదేశం నాయకుడు ముద్దు కృష్ణమనాయుడు తెలంగాణ ముఖ్యమంత్రికి ఓ వెరైటీ ప్రతిపాదన పెట్టాడు. ఒకవైపు చిన్న జిల్లాలు చేసినందుకు కేసీఆర్‌ను అభినందిస్తూనే... ఆ సందర్భంగా.. నందమూరి తారక రామారావు అప్పట్లో మండల వ్యవస్థను తీసుకు వచ్చిన వైనంతో పోల్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూనే.. అభివృద్ధి పరంగా తెలంగాణ రూపు రేఖలు మారిపోవడంతో కీలక పాత్ర పోషించిన.. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
అసలే ఆంధ్ర పాలకుల దుర్మార్గం అంటూ తెగ తిట్టిపోసి కేసీఆర్ తన గులాబీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఒక టర్మినల్ కు ఇదివరకు ఉన్న ఎన్టీఆర్ పేరును మళ్లీ పెట్టినందుకే తెరాస రాష్ట్రమంతా నానా యాగీ చేస్తే.. తెలంగాణ ఒక జిల్లాకు నందమూరి తారకరాముని పేరు పెట్టమని ముద్దు కృష్ణమ చేస్తున్న డిమాండ్.. కామెడీలోకెల్లా పరాకాష్టగా ఉంది.
అయితే ఇక్కడ ఓ ట్విస్టును గమనించాలి. నందమూరి తారక రామారావుకు కేసీఆర్ వీరఫ్యాన్ అనే సంగతి చాలా మందికి తెలుసు. ఎంత అభిమానం అంటే.. తన కొడుకుకు కూడా ఆయన గుర్తుగా ‘తారక రామారావు’ అని పేరు పెట్టుకున్నారు. ఒక జిల్లాకు తారక రాముని పేరు పెడితే.. అటు ఎన్టీఆర్ పేరు పెట్టారో, ఇటు కన్న కొడుకు పేరు పెట్టారో తెలియకుండా.. మంచి సరదాగా ఉంటుందని కొందరు అంటున్నారు.
అయినా, తెలంగాణ లో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసినందుకు, పరిపాలన ను ప్రజల దగ్గరకు తీసుకువచ్చినందుకు అక్కడి ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు బాగానే ఉంది. మరి ఏపీలోని తెలుగుదేశం నాయకులకు, కనీసం ముద్దు కృష్ణమ వంటి సీనియర్లకు అయినా.. అదే పని మన రాష్ట్రంలో కూడా చేద్దాం అనే సూచనను చంద్రబాబునాయుడు వద్దకు తీసుకువెళ్లగల ధైర్యం ఉందా లేదా అనేది ప్రశ్న.

