ముందు అధినేత మారాలంటున్న ఎమ్మెల్యేలు

తెలుగుదేశం పార్టీ అధినేత తీరు మారలేదంటున్నారు ఆ పార్టీ నేతలు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయడానికి నిధులు విడుదల చేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లమంటే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కేవలం కలెక్టర్ల మీదనే ఆధారపడుతూ వారు చెప్పిన పనులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. నిన్న ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలకు గ్రేడ్లు ఇచ్చిన చంద్రబాబు వారికి వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. పెర్ ఫార్మెన్స్ సరిగా లేకుంటే టిక్కెట్ కూడా ఇవ్వనని మొహమాటం లేకుండా చంద్రబాబు చెప్పేశారు. మిమ్మల్ని నమ్ముకుని ఎన్నికలకు దిగితే తానూ మునిగిపోతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకోసం గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అని ఆయన ప్రకటించారు.
ఫీడ్ బ్యాక్ మమ్మల్ని అడిగితే......
చంద్రబాబుతో సమావేశం ముగిసిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు ఆయన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ల నుంచి నిధుల కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని, మంత్రుల వద్దకు వెళ్లినా వారు నిధుల్లేవంటూ చేతులెత్తేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వద్దకు వెళదామంటే అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక సీనియర్ నేత అయితే గతంలో తొమ్మిదేళ్లుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు,ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదని చెప్పేశారు. ఆయన ఎక్కువగా అధికారులపై ఆధారపడి, ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలను పట్టించుకోవడం లేదంటున్నారు. ఫీడ్ బ్యాక్ కూడా ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారో తమకు తెలియదని, తమను అడిగితే వాస్తవ పరిస్థితులను చెబుతామని కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల వద్ద వాపోయినట్లు తెలిసింది. వాస్తవానికి చంద్రబాబు తను ఒక్కడి వల్లనే అధికారంలోకి వచ్చామని భ్రమిస్తున్నారని, అందరూ కలిస్తేనే పార్టీకి గెలుపు దక్కుతుందన్న విషయాన్ని గుర్తించాలని కొందరు కోరారని తెలిసింది. ఫీడ్ బ్యాక్ పేరుతో టిక్కెట్లు ఇవ్వమంటే కుదరదని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్ ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేల్లో ఆందోళనతో పాటు... ఆవేదనను కూడా కల్గించాయి.
- Tags
- చంద్రబాబు

