మినీ ఎన్నికలు తప్పవా?

తెలంగాణలో మినీ ఎన్నికలు రానున్నాయా? ఇంకా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువుంది. అయితే ఈలోగా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ కు చెందిన 11 మంది శాసనసభ్యులను సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాన్నిరద్దు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. హైకమాండ్ అనుమతికోసం పంపినా రాష్ట్రంలోని అందరూ ఏకాభిప్రాయంతో ఉండటంతో మూకుమ్మడి రాజీనామాలకు ఏఐసీసీ అంగీకరిస్తుందంటున్నారు.
13 స్థానాలకు ఉప ఎన్నికలు?
మూకుమ్మడి రాజీనామాలు చేస్తే తెలంగాణలో 13 స్థానాలకు ఎన్నికలు జరగడం ఖాయంగా కన్పిస్తోంది. ఇందులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు, నల్లగొండ జిల్లాలో నాలుగు స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేసినా స్పీకర్ అందుకు అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. మూకుమ్మడి రాజీనామాలకు దిగితే స్పీకర్ కూడా వాటిని ఆమోదించాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా జానారెడ్డి లాంటి వారిని సస్పెండ్ చేయడం తమకు కలిసి వచ్చిందంటున్నారు.
పాజిటివ్ వేవ్ ఉందంటూ....
ఎవరినీ నొప్పించని జానారెడ్డి లాంటి వారినే సస్పెండ్ చేస్తే ప్రజల్లో ఖచ్చితంగా తమకు పాజిటివ్ వేవ్ వస్తుందని భావిస్తున్నారు. అందుకోసమే ఉప ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఉన్న స్థానాల్లో తామంతా బలంగా ఉన్నందున ఉప ఎన్నికలు వచ్చినా విజయం ఖాయమంటున్నారు. అలాగే ఈ ఉప ఎన్నికల్లో విజయం వచ్చే సాధారణ ఎన్నికలకు రిఫరెండంగా మారుతుందంటున్నారు. అందుకే ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు రాజీనామాలకు సై అంటున్నారు. అధిష్టానం నిర్ణయంపైనే వీరి రాజీనామాలు ఆధారపడి ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
