మాదే సర్జికల్.. వాళ్లవి ఉత్తుత్తివే అంటున్న పారికర్

‘సర్జికల్ దాడులు’ అనే వ్యవహారం ఫక్తు రాజకీయ ప్రచార అంశంగా మారిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఈ సర్జికల్ దాడులకు ముడిపెట్ట అనుమానాలను, కీర్తిబావుటాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో ఏవగింపు పుట్టేలా చేస్తున్నారు. దృఢంగా వ్యవహరించే విషయంలో ఎంతో నిజాయితీగల వ్యక్తిగా పేరున్న కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. తాజాగా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే వారి జాబితాలోకి చేరుతున్నారు. తాను కూడా ఆ తాను ముక్కనే అని నిరూపించుకుంటున్నారు.
సర్జికల్ దాడులకు సంబంధించి మోదీకి ఎక్కడ కీర్తి వచ్చేస్తుందో అని కాంగ్రెస్ విపరీతంగా ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. మాహయాంలో మేం చాలా సర్జికల్ దాడులు చేశాం.. కానీ ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు అంటూ కాంగ్రెస్ నాయకులు... రెండు రోజుల కిందట అప్పటి జాతీయ రక్షణ సలహాదారు మీనన్ లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే ఇవాళ పారికర్ దానికి జవాబిచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నాకు తెలిసి సర్జికల్ దాడులు అనేవి జరగనే లేదు. కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నవన్నీ.. మామూలు దాడులు. సరిహద్దుల్లో నిత్యం ప్రతిరోజూ జరుగుతూ ఉండే దాడులు అని పారికర్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల కిందట తాజా సర్జికల్ దాడుల ఘనత మొత్తం మోదీ దే అని వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్న పారికర్, ఇప్పుడు కాస్త సవరించుకున్నారు. మోదీతో పాటూ దేశ ప్రజలందరికీ ఈ ఘనత చెందుతుందని.. దేశ ప్రజలందరూ ఈ దాడుల గురించి సంతోషిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
తాము చేసినవి మాత్రమే సర్జికల్ దాడులు, కాంగ్రెస్ చేసినవన్నీ ఉత్తుత్తి దాడులు అని చెప్పడం ద్వారా.. ఆ పార్టీనుంచి మళ్లీ ప్రతివిమర్శలకు పారికర్ ఆస్కారం కల్పించినట్లుగా కనిపిస్తోంది.

