మాజీ రాష్ట్రపతి బాటలోనే మాజీ ప్రధాని!

కొందరు అంతే! వారికి తమకు నచ్చిన పనిలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదు. విధివశాత్తూ లేదా, పరిస్థితుల వశాత్తూ ఎన్ని గొప్ప పదవులు అలంకరించినా కూడా.. తమకు నచ్చిన పనిలో అంతకంటె గొప్ప తృప్తిని వారు అనుభూతించగలరు. ఆ కోవలోకి మన అబ్దుల్ కలాం వస్తారు. భారత రాష్ట్రపతిగా సేవలు అందించిన తర్వాత.. మళ్లీ కాలేజీ ప్రొఫెసర్గా తనకు నచ్చిన జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి ఆయన. ఇప్పుడు అదే బాటలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా నడవబోతున్నారు. ప్రధానిగా కంటె మన దేశంలో ఉన్న అతిగొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా ఎప్పటికీ గుర్తుండే మన్మోహన్ సింగ్ తాను చదువుకున్న పంజాబ్ యూనివర్సిటీలోనే వారు ప్రతిపాదించిన ఓ ప్రొఫెసర్ పదవిని చేపట్టబోతున్నారు.
మన్మోహన్ సింగ్ కు నియమబద్ధమైన వ్యక్తిగా పేరుంది. అందుకే ఆయన తనకు పంజాబ్ యూనివర్సిటీ చేసిన ప్రతిపాదన పట్ల కూడా వెంటనే స్పందించలేదు. అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తాను.. ఇలాంటి యూనివర్సిటీ కోరుతున్న పదవిని స్వీకరిస్తే తప్పవుతుందా? లేదా? తెలియజేయాలని ముందే రాజ్యసభ ఛైర్మన్ ను కోరారు. ఆయన దాని మీద ఓ కమిటీ వేశారు. కమిటీ నియమ నిబంధనలను పరిశీలించి.. ఆయనకు ఇవ్వబోతున్న పదవి.. లాభదాయక పదవి కిందికి రాదు గనుక.. స్వీకరించవచ్చునని తెలిపింది.
మొత్తానికి మౌనమునిగా పేరున్న మన్మోహనుడు మళ్లీ ప్రొఫెసర్ పదవిలోకి వస్తున్నారు. ఆర్థిక శాస్త్రం మీద ఆయనకు ఉన్న పట్టు, పరిణతి భావితరాల విద్యార్థులకు అందించే కృషిలో ఆయన సక్సెస్ అయితే మంచిదే.

