మాజీ మంత్రి రావెలకు ఏం జరిగిందంటే?

మాజీ మంత్రి రావెల పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏకంగా ఆయన పై దాడికి దిగుతున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రావెలపై ఆ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు దాడి చేయడానికి ప్రయత్నించారు. గుంటూరు జిల్లాలోని వింజనంపాడులో టెన్షన్ నెలకొంది. ఈ కార్యక్రమానికి ఎంపీ గల్లా జయదేవ్ కూడా హాజరయ్యారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రావెల కిశోర్ బాబుపై టీడీపీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. రావెల వైసీపీకి చెందన కార్యకర్తలకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తున్నారన్నది ఆ పార్టీ కార్యకర్తల ప్రధాన ఆరోపణ. దీనిపై ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కూడా. అయినా అధిష్టానం కూడా రావెల వ్యవహారాలను చూసీ చూడనట్లు వదిలేస్తుంది.
టీడీపీ కార్యకర్తలే దాడికి యత్నం.....
నేపథ్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గానికి వచ్చిన ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి రావెల తొలుత కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి, పరిటాల విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అదే గ్రామంలో టీడీపీలో రెండు గ్రూపులున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలిద్దరూ ఒకవర్గానికి చెందిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడంతో మరొక వర్గానికి చెందిన కార్యకర్తలు మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీ గల్లా జయదేవ్ ను, ఎమ్మెల్యే రావెలను అక్కడి నుంచి పంపించి వేశారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జి కూడా చేశారు. రావెల వైఖరిని నిరసిస్తూ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు బహిష్కరించారు.
- Tags
- రావెల

