మాజీ ఆర్థికమంత్రికి జగన్ ఎర్త్ పెడతారా?

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఆత్మకూరు నియోజకవర్గం అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి నియోజకవర్గం. ఇప్పటికీ ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆనం రామనారాయణరెడ్డి అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అధికారంలో ఉండటంతో ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ పిలుపు నిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
ఆనం నియోజకవర్గంలో….
ఆనం రామనారాయణరెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మనాయుడపైన దాదాపు 18 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతం రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి కన్నబాబుపై 30 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. మేకపాటి గౌతమ్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడే. ఆయన వచ్చే ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం జగన్ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో మేకపాటి వర్గీయుల్లో ఆనందం పెల్లుబుకుతోంది.
టీడీపీలో గ్రూపు తగాదాలు…
మరోవైపు ఇదే నియోజకవర్గంలో టీడీపీలో గ్రూపు తగాదాలు తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు తమపై ఎలా పెత్తనం చేస్తారని గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కన్నబాబు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఆనం తన వర్గీయులకు జన్మభూమి కమిటీల్లో పెద్ద పీట వేశారని, వారంతా కాంగ్రెస్ వారేనన్నది కన్నబాబు ఆరోపణ. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికీ తీసుకెళ్లారు. అయితే ఆనం నియోజకవర్గం కావడంతో అధిష్టానం కూడా కన్నబాబును పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు ఆనం రామనారాయణరెడ్డికి ఇస్తే కన్నబాబు వర్గం మద్దతిస్తుందా? లేదా? అన్నది కూడా సందేహమేనన్నది ఆ పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న మాట.
మరోసారి జెండా ఎగరేయాలని….
ఇదిలా ఉంటే ఇదే నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు. నియోజకవర్గంలో సంగం గ్రామంలో నిర్వహించిన సభకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యారు. ఆనం కుటుంబం జగన్ పై తీవ్ర విమర్శలు చేసేది. అయినా జగన్ తన ప్రసంగంలో ఎక్కడా ఆనం ఊసెత్తక పోవడం విశేషం. కేవలం రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు పైనే జగన్ తన విమర్శలు ఎక్కుపెట్టారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమైందని జగన్ ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి చంద్రాబాబు 90 వేలు బాకీ ఉన్నారని జగన్ ఆరోపించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఆత్మకూరు నియోజకవర్గంలో జగన్ పర్యటన విజయవంతం అవుతుండటంతో ఇక్కడ మరోసారి వైసీపీ జెండా ఎగురుతుందన్న ఆశాభావం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది.

