మళ్లీ మూడు లక్షల కోట్లు వచ్చేశాయ్

విశాఖ కేంద్రంగా ఏపీ మూడోసారి పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునే సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సులో మూడు లక్షల కోట్ల ఎంఓయూ లు ఈ ఏడాదికి వచ్చేశాయని రెండో రోజుకే ప్రకటించేశారు. గతంలో నిర్వహించిన సదస్సుల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడుల వరద వచ్చినట్లు ప్రకటించారు. ఒప్పందాలమాట ఎలా వున్నా నెలకొల్పుతున్న పరిశ్రమలు మాత్రం కానరావడం లేదు. రాష్ట్రంలో నిరుద్యోగసమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడమే కాదు పెరుగుతూ వస్తుంది. వాస్తవానికి చెప్పిన పరిశ్రమలన్నీ ఏపీకి తరలివచ్చి ఉంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా దూసుకుపోయేది.
పరిశ్రమలు ఎందుకు రావడం లేదు...?
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో అనేక సమస్యలు ఏపీ చుట్టూ ముప్పిరిగొని వున్నాయి. చంద్రబాబు ప్రపంచంలో పెట్టుబడులు భారీగా పెట్టే దేశాలన్నీ ప్రధాని నరేంద్రమోడీ తో సమానంగా చుట్టేస్తున్నారు. కనిపించిన ప్రతి పారిశ్రామికవేత్తను ఏపీకి రావాలని కోరుతున్నారు. అలాగే భారీ సదస్సుల్లో లక్షలకోట్ల రూపాయల భాగస్వామ్య ఒప్పందాలు జరిగిపోతున్నాయి. ఇన్ని జరుగుతున్నా పరిశ్రమలు రాకపోవడానికి పలు కారణాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు. రాష్ట్రంలో మౌళిక సదుపాయాల కల్పన పూర్తిగా లేకపోవడం, ప్రత్యేక హోదా వంటి ఇన్సెంటివ్ లు వచ్చే ఛాన్స్ కనిపించకపోవడం, శృతిమించిన అవినీతి బడా పరిశ్రమల వెనుకంజ వేయడానికి కారణాలంటున్నారు.
హోదా ఇస్తే ...
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిఉంటే భాగస్వామ్య సదస్సుల అవసరమే లేదని చెబుతున్నారు విశ్లేషకులు. అన్ని రాయితీలు అందులోనే ఉంటాయి కనుక ఈపాటికే భారీ సంఖ్యలో పరిశ్రమలు వచ్చి వాలేవన్నది నిపుణుల అభిప్రాయం. గత మూడేళ్ళుగా నిర్వహించిన సదస్సుల్లో ప్రచార ఆర్భాటం ఎక్కువా పని తక్కువైందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటివరకు పర్యాటక రంగం వైపుగా నక్షత్రాల హోటల్స్ మాత్రమే ఎక్కువ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న తీరు గమనిస్తే మిగిలిన రంగాలవైపు రాయితీలు లేకే పరిశ్రమలు రాలేకపోతున్నట్లు తేలుతుంది.

