మళ్లీ ప్లేటు ఫిరాయించిన వెంకయ్య

వెంకయ్యనాయుడు మరోసారి ప్లేటు ఫిరాయించారు. ప్రత్యేక హోదా విషయంలో ఇన్నాళ్లూ ఒక రకం మాటలు చెబుతూ వచ్చిన వెంకయ్యనాయుడు ఇప్పుడు అసలు మన రాష్ట్రానికి హోదా పొందడానికి తగిన అర్హతలే లేవంటూ కొత్త పాట అందుకున్నారు. కేవలం కొండ, గిరిజన ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాలకు మాత్రమే హోదా ఇస్తారని ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడానికి అవకాశం లేదని ఆయన అంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ అనేది తాను ఎంతో పోరాడితే తప్ప రాలేదని కూడా వక్కాణిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు జైట్లీ ప్రత్యేక హోదా ప్రకటించిన నాటినుంచి వెంకయ్యనాయుడు ఊరూరా తిరుగుతూ.. ఏపీకి ప్యాకేజీ సాధించడానికి తానెంత కష్టపడ్డానో, అది పూర్తిగా తన ఘనత మాత్రమే ఎలా అవుతుందో టముకు వేసుకుంటూ తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా స్థానిక నాయకులతో ఊరూరా.. సన్మానాలు చేయించుకుంటున్నారు. ప్యాకేజీ సాధించిన హీరో కింద గుర్తింపు తెచ్చుకోవడానికి తహ తహ లాడిపోతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా కాకినాడలో అలాంటి సన్మానం చేయించుకున్న వెంకయ్యనాయుడు.. అక్కడి ప్రసంగంలో అసలు ఏపీకి ప్రత్యేక హోదా పొందే అర్హతే లేదంటూ కొత్త వాదన వినిపించడం విశేషం. మరి ఒక రాష్ట్రానికి హోదా రావాలంటే ఉండవలసిన అర్హతల గురించి ఇంతక్లారిటీ ఉన్న నాయకుడు వెంకయ్యనాయుడు, ఆరోజు రాజ్యసభలో పదేళ్ల హోదా గురించి ఆ స్థాయిలో ఎందుకు నానా యాగీ చేశారో అర్థం కాని సంగతి. తాను చెబుతున్నదంతా బుకాయింపు మాత్రమేనని, ప్రజలందరూ గుర్తిస్తున్నారని తెలిసినప్పటికీ కూడా.. నిర్భయంగా బుకాయించడం అనే విద్య వెంకయ్యనాయుడుకు బాగానే అబ్బినట్టుంది.

