మళ్లీ దినకరన్ కు పని పడిందే...!

ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగబోతోంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడమే తరువాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు డిసెంబర్ 31 లోగా పోలింగ్ నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు ఓకే చెప్పింది. జయలలిత మరణంతో ఆర్కే నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నిక కు జయ మృతి చెందిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థుల నుంచి నామినేషన్లను కూడా స్వీకరించింది. అప్పట్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా టీటీవీ దినకరన్, పన్నీర్ సెల్వం తరుపున మధుసూధనన్, జయలలిత మేనకోడలు దీప తదితరులు బరిలో నిలిచారు. ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడే సమయంలో పెద్దయెత్తున డబ్బులు పంచినట్లు ఆరోపణలు విన్పించాయి.
మద్రాస్ హైకోర్టు ఓకే....
ఆర్కేనగర్ లో ఓటుకు దాదాపు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పంచేందుకు దినకరన్ బ్యాచ్ సిద్ధమైంది. ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును అప్పటికే కొందరికి పంపినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు గుర్తించారు. దినకరన్ తన ప్రచారానికే 90 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించిన ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికను రద్దు చేసింది. సాధారణంగా ఏదైనా కారణంగా శాసనసభ స్థానానికి ఖాళీ ఏర్పడితే ఆరు నెలలో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. కాని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టినట్లు రుజువు కావడంతో ఈసీ ఈ ఎన్నికను రద్దు చేసింది. మరోవైపు ఎన్నికల గుర్తు కోసం దినకరన్ ఎన్నికల కమిషన్ అధికారులకే కోట్ల రూపాయలు ఎర చూపడం కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నికను డిసెంబరు 31వ తేదీలోగా జరపేందుకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈసీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఓటర్ల జాబితా నుంచి ఇప్పటికే అధికారులు 45 వేల బోగస్ ఓటర్లను తొలగించారు. మరోవైపు ఇప్పుడు పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఒక్కటయ్యారు. దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. మరి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఉంటాయో చూడాలి.

