మళ్లీ తేడా వచ్చిందే....!

మళ్లీ తేడా వచ్చిందా... రెండాకులు గుర్తు రాగానే... ఆధిపత్య పోరు మరోసారి బయటపడుతుందా? అవును... ఇది నిజం. తమిళనాడు అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం, పళనిస్వామిల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమంటున్నాయి. రెండాకుల గుర్తు విజయోత్సవ సభకు పన్నీర్ సెల్వంను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారిదంి. రెండాకుల చిహ్నం పళనిస్వామి, పన్నీర్ సెల్వానికి దక్కడంతో మధురైలో విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. దానికి ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం పన్నీర్ సెల్వాన్ని ఆహ్వానించలేదు. పళనిస్వామి హాజరైన ఈ సమావేశానికి తన ప్రసంగంలో ఎక్కడా పన్నీర్ సెల్వానికి చోటు కల్పించలేదు. రెండాకుల గుర్తు తమకే దక్కడంతో ముఖ్యమంత్రి పళనిస్వామి పన్నీర్ సెల్వాన్ని పక్కన పెట్టాలన్న యోచనలో ఉన్నట్లు తమిళనాట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
రెండాకుల గుర్తు దక్కడంతో....
పన్నీర్ సెల్వాన్ని దగ్గరకు తీసుకోవడంతో శశికళ వర్గాన్ని పళనిస్వామి బయటకు పంపారు. రెండాకుల గుర్తు కోసమే పన్నీర్ సెల్వాన్ని పళనిస్వామి దగ్గరకు తీసుకున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. రెండాకుల గుర్తు ఎక్కడ తమకు దక్కకుండా పోతుందన్న ఆందోళనతోనే పళనిస్వామి అయిష్టంగానే పన్నీర్ సెల్వాన్ని మంత్రివర్గంలోనూ, పార్టీలోనూ చేర్చుకున్నారని చెబుతున్నారు. రెండాకుల గుర్తు ఇప్పుడు లభించడంతో పన్నీర్ సెల్వాన్ని పక్కన పెట్టేశారని సాక్షాత్తూ పన్నీర్ సెల్వానికి మద్దతుగా ఉన్న ఎంపీ మైత్రేయన్ స్పందించడం విశేషం. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఎవరికి లాభం? తేలాల్సి ఉంది.

