మర్రి గొడవ మర్రిది: ఈసారి ఇళ్ల నిర్మాణాలు

ఆవు వ్యాసం మాత్రమే చదువుకుని వచ్చిన కుర్రాడు.. బడిలో టీచరు ఏ ప్రశ్న అడిగినా ఆవు వ్యాసంలోంచే సమాధానం చెప్పినట్లుగా తెలంగాణ రాజకీయాల్లో నిత్యం మనకు ఓ పరిణామం కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణలో ఏం జరిగినా సరే.. దానితో తలసాని శ్రీనివాసయాదవ్ కు లింకు ఉందని మర్రి శశిధర రెడ్డి నమ్ముతారు. అలాగని ప్రచారం కూడా చేస్తారు. ఏతావతా సనత్ నగర్ నియోజకవర్గంలోని ప్రజలంతా తలసాని శ్రీనివాస యాదవ్ ను ఓడించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అంతిమంగా జనానికి ఓ అప్రకటిత రిక్వెస్టు పెట్టుకుంటారు.
తాజాగా ఆయన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల గురించి మర్రి శశిధర్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని మర్రి ఆరోపిస్తున్నారు. ఆ అవినీతి పాపంలో.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు సంబంధం ఉన్నదని.. తక్షణం ఆయనను పదవినుంచి తొలగించి విచారణ సాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో.. అందరితో సరిగా కలసిమెలిసి పనిచేసే అలవాటు లేకపోయినా.. కాస్త నిర్మాణాత్మక విమర్శలు చేసే మేధావి నాయకుడిగా మర్రి శశిధర్ రెడ్డికి గుర్తింపు ఉంది. కాకపోతే ఆయన తన పోరాటం మొత్తాన్ని తన నియోజకవర్గం సనత్ నగర్ వరకే, తలసాని శ్రీనివాసయాదవ్ మీద పోరాడడం వరకే పరిమితం చేసుకుంటూ ఉంటారు. గతంలోనూ నకిలీ ఓట్ల నమోదు చేశారంటూ ఆయన సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే ఆయన ఏ పని చేసినా సరే.. దాని ఎజెండా మాత్రం తలసాని బద్నాం గానే ఉంటుందని పలువురు వ్యఖ్యానిస్తున్నారు.
తాజాగా అసెంబ్లీ మొదలు కాబోతున్న తరుణంలో తమ పార్టీ తరఫున సభలో సమస్యలను లేవనెత్తే వాళ్లకు మర్రి కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసినట్లుగా ఉంది. ఆయన ఆరోపణ చేశారంటే దాని మీద పూర్తిస్థాయిలో గణాంకాలు కూడా సిద్ధం చేసుకునే ఉంటారు. మరి ఆయన సేవల్ని, డబుల్ బెడ్ రూం ఇళ్లలో అవినీతి అంశాన్ని పార్టీ ఎలా వాడుకుంటుందో.

