మరో వైసీపీ ఎమ్మెల్యే జంప్ కు సిద్ధమయ్యారా?

గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గుంటూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ఎందుకు కలిశారన్నది అర్థం కావడం లేదు. ముస్తాఫా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు కారులో ఆయన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుంటూరులో ఈరోజు చంద్రబాబు ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆయనను హెలిప్యాడ్ లో ముస్తాఫా కలుసుకుని ప్రత్యేకంగా మాట్లాడారు.
సీఎం చంద్రబాబును కలిసి....
గత కొద్ది రోజులుగా ఆపరేషన్ ఆకర్ష్ కు వైసీపీ నేతలు ఎవరూ పడటం లేదు. జగన్ పాదయాత్ర ప్రారంభిచిన తర్వాత రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీని వీడారు. జగన్ పాదయాత్రకు మంచి స్పందన కన్పిస్తుండటంతో ఇక ఎవరూ పార్టీ వీడరని వైసీపీ కూడాభావించింది. ఈ నేపథ్యంలో గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా చంద్రబాబును కలవడం వైసీపీలో కలకలం రేపింది. పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు ముస్తాఫాను వెంటపెట్టుకుని మరీ చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు.
మర్యాదపూర్వకంగానే కలిశానుంటున్న....
అయితే ముస్తాఫా మాత్రం తాను వంద శాతం పార్టీని వీడేది లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి వచ్చినందున ఆయనను మర్యాదపూర్వకంగానే కలిసేందుకు వెళ్లానంటున్నారు ముస్తాఫా. అయితే చంద్రబాబు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడా వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయిన దాఖలాలు లేవు. పార్టీ మారేందుకే ముస్తాఫా నిర్ణయించుకున్నారని, అందుకే చంద్రబాబుతో భేటీ అయి చర్చలు జరిపారని అమరావతిలో టాక్ విన్పిస్తోంది. ముస్తాఫా అనేకసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. గత ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన ముస్తాఫా పార్టీని మారతారా? లేక ఆయన చెబుతున్నట్లే మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారా? అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.
- Tags
- వైసీపీ

