మరో వైసీపీ ఎమ్మెల్యే అవుట్..!

పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీని వీడనున్నారా? ఎందుకు ఆమె ఆ నిర్ణయం తీసుకోనున్నారు. గిడ్డి ఈశ్వరి తొలినుంచి వైసీపీ అధినేత జగన్ ను నమ్ముకునే ఉన్నారు. ఆయన వెంటే సాగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా తీవ్ర విమర్శలు చేసే గిడ్డిఈశ్వరి కొద్దిరోజులుగా మనస్తాపానికి గురవుతున్నారు. జగన్ పై విమర్శలు చేసిన వారినే తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రయత్నానికి ఆమె అభ్యంతరం చెబుతున్నారు. దీంతో గిడ్డి ఈశ్వరి ఈరోజు పాడేరులో తన అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
సీనియర్ నేతల వల్లనే....
అరకు నియోజకవర్గానికి గిడ్డి ఈశ్వరి ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అరకు వైసీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆపార్టీని వీడి టీడీపీలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అరకు వ్యవహారాలన్నింటినీ గిడ్డి ఈశ్వరి చూస్తున్నారు. జగన్ చేత గిరిజన గర్జనను కూడా అక్కడి నిర్వహించారు. ఇలా పార్టీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గిడ్డి ఈశ్వరికి పార్టీ సీనియర్ నేతలు ఝలక్ ఇచ్చారు. ఈశ్వరికి తెలియకుండానే మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును పార్టీలోకి చేర్చుకునేందుకు అంతా సిద్ధంచేశారు. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు సమావేశం ఏర్పాటు చేసి తాను త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తాననికూడా చెప్పడంతో గిడ్డి ఈశ్వరి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అరకు నియోజకవర్గంలో కిడారి సర్వేశ్వరరావు పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత శెట్టి ఫాల్గుణను ఇన్ ఛార్జిగా నియమించారు. ఆయన బ్యాంకు ఉద్యోగి అయినా రాజీనామా చేసి మరీ వైసీపీలోకి వచ్చారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా కుంభా రవి బాబుకు ఎలా ఇస్తారన్నది గిడ్డి ఈశ్వరి ప్రశ్న. కుంభా రవిబాబును పార్టీలో చేర్చుకుంటే తాను పార్టీని వీడి వెళ్లడం ఖాయమని ఈశ్వరి తన సన్నిహితులతో చెబుతున్నారు. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరిపోయారు. సీనియర్ల నిర్ణయంతో మరో ఎమ్మెల్యే పార్టీ వీడటానికి కారణమయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ విషయంపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో చర్చించినా ఫలితం లేకపోవడంతో ఆమె పార్టీని వీడాలనే నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
- Tags
- గిడ్డి ఈశ్వరి

