మన్నార్ గుడి మాఫియా మట్టికర్చినట్లేనా?

చిన్నమ్మకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. చిన్నమ్మ బ్యాచ్ ఇక కకావికలం కాక తప్పదు. నిన్నటి వరకూ చిన్నమ్మకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడుల చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. కోట్ల రూపాయల నగదుతో పాటు, కేజీల కొద్దీ బంగారాన్ని అధికారులు దాడుల్లో కనుగొన్నారు. ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా అక్రమాస్తులను చిన్నమ్మ కుటుంబం కూడబెట్టినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కు చెందిన రెండాకుల గుర్తు కూడా పోవడంతో ఇక శశికళ బ్యాక్ కోలుకోలేదన్నది విశ్లేషకుల అంచనా. పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతుల్లోకి పార్టీ పూర్తిగా వెళ్లిపోయింది. అధికారం కూడా వారి చేతుల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ వర్గం కుదేలవ్వడం ఖాయమంటున్నారు. ఇది కూడా పోతీే మన్నార్ గుడి మాఫియా మట్టి కరిచినట్లేనంటున్నారు.
ఉప ఎన్నికల్లోనూ గుర్తుపాయే....
ఆర్కేనగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తే తాను పోటీచేస్తానని శశికళ మేనల్లుడు దినకరన్ చెబుతున్నారు. ఆయనకు ఇప్పుడు రెండాకుల గుర్తు లభించదు. జయలలితకు దశాబ్దాలుగా అండగా నిలిచిన రెండాకుల గుర్తు ఇప్పడు పళనిస్వామి చెంతకు చేరిపోయింది. ముఖ్యంగా ఆర్కే నగర్ ప్రజలకు రెండాకుల సెంటిమెంట్ ఎక్కువగా ఉందంటున్నారు. రెండాకుల గుర్తు చూస్తేనే అమ్మ గుర్తుకు వస్తుందని, దీంతో తమ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకేనంటున్నారు పన్నీర్, పళనిస్వామి వర్గాలు. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో మధుసూదనన్ ను పోటీ చేయించాలని పన్నీర్ సెల్వం పట్టుబడుతున్నారు. మధుసూదనన్ తొలి నుంచి పన్నీర్ వెంటే ఉన్నారు. అయితే పళనిస్వామి ఇందుకు అంగీకరించడం లేదు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. మనుషులు కలిసినా మనసులు కలవలేదని ఎంపీ మైత్రేయన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. అయితే మధుసూదనన్ అభ్యర్థిత్వమే ఖరారయ్యే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక టీటీవీ దినకరన్ ఈ ఎన్నికల్లో విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవైపు అధికార పార్టీ అండలేకపోవడం, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే దినకరన్ కు విజయం కష్టమే అవుతుందంటున్నారు. మొత్తం మీద ఆర్కే నగర్ ఉప ఎన్నిక హాట్ హాట్ గా జరిగే అవకాశముంది.

