మద్య నిషేధం లో నితీష్ విక్రమార్కుడే

కోర్టును ధిక్కరించి అయినా మద్యనిషేధం అమలు చేయడానికి బీహార్ లోని నితీష్ సర్కారు కృత నిశ్చయంతో ఉన్నట్లుంది. ఈ విషయంలో అవసరం అయితే సుప్రీంకోర్టు కు అయినా వెళతాం అంటూ ఆయన ప్రకటించడం విశేషం . గాంధీ జయంతికి ఇదే అచ్చమైన నివాళి అని అయన పేర్కొనడం గమనార్హం.నితీష్ సర్కారు మద్యాన్ని నిషేధిస్తూ చేసిన చట్టం చెల్లదని హై కోర్టు చెప్పింది. అయితే గాంధీ జయంతి నటి నుంచి మళ్ళీ ఆ చట్టం అమలు చేస్తున్నట్లు నితీష్ ప్రకటించడం విశేషం.
నితీశ్ కుమార్ చిత్తశుద్ధి గల పాలన అందించిన వ్యక్తిగా బీహార్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. దేశం మొత్తం మోదీ హవా నడుస్తున్నదని ప్రచారం జరిగిన రోజుల్లో కూడా.. మోదీని దెప్పి పొడుస్తూనే.. బీహార్ లో తనకున్న విలువ ఏమిటో నిలబెట్టుకున్నాడు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన సమయానికి నితీశ్ హవాకు అడ్డుకట్ట వేయడానికి మోదీ, అమిత్ షా లు శతవిదాల ప్రయత్నించినా వారి వల్ల కాలేదు.
ఆ ఎన్నికల్లో హామీ ప్రకారమే నితీశ్ మద్యనిషేధాన్ని అమలు చేస్తుండగా.. ఆ చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ రాష్ట్ర హై కోర్టు దాన్ని కొట్టివేసింది. దాని స్థానే కొత్త చట్టం తీసుకువచ్చి.. అక్టోబరు 2వ తేదీనుంచి మళ్లీ మద్యనిషేధాన్ని నితీశ్ అమల్లో పెట్టడం గమనార్హం. ఈ విషయంలో ఆయన పార్టీ యావత్తూ కూడా నిషేధానికి అనుకూలంగానే ఉంది. అవసరమైతే సుప్రీంను ఆశ్రయించి అయినా మహాత్మాగాంధీ ఆశయం అయిన మద్యనిషేధాన్ని అమల్లో ఉంచడానికి ప్రయత్నిస్తామని వారు అంటుండడం విశేషం.

