మందుకొట్టి తప్పు చేస్తే శిక్ష తగ్గుతుంది

అనగనగా ఒక భర్త. భర్త అంటే ఆధునిక సమాజంలో ఎలాంటి దుర్మార్గమైన నిర్వచనాలు ఉంటాయో.. అలాంటి అన్ని నిర్వచనాలకు సరితూగగల గొప్ప భర్త. సకల వ్యసనాభిలాషుడు. అలాంటి భర్తగారు ఒకపూట పూటుగా తాగి వచ్చి.. భార్యను తన లైంగిక వాంఛ తీర్చాల్సిందిగా ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించింది. కోపంలో ఆమె మీద కిరోసిన్ పోసి తగలబెట్టేశాడు. ఆమె మరణించింది. కేసును విచారించిన మహబూబ్ నగర్ సెషన్స్ కోర్టు నిందితుడు భీమయ్యకు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. ఆయన అప్పీలు చేసుకున్నాడు. హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు వారు మరో కీలక అంశాన్ని గుర్తించారు. భార్యను హత్య చేసిన సమయంలో, భీమయ్య బాగా మద్యం తాగి ఉన్నాడు గనుక.. శిక్షను తగ్గించింది.
ఈ కేసులో ట్విస్టు అదే. ఎవరైనా సరే మర్డర్ చేసే ముందు తాగి మర్డర్ చేస్తే తక్కువ శిక్షతో బయటపడవచ్చు అని సంకేతం ఇచ్చే విధంగా ఈ తీర్పు ఉన్నదని పలువురు భావిస్తున్నారు. నిజానికి భీమయ్య భార్య చేసిన తప్పు కూడా ఏమీ లేదు. ఆమెకు మూడు నెలల కిందట గర్భసంచి తొలగించారు. ఆరునెలల వరకు లైంగిక చర్య తగదని డాక్టర్లు చెప్పారు. భర్త తాగి వచ్చి ఒత్తడి చేసేసరికి ఆమె నిరాకరించింది. ఈ విషయాలన్నీ ఆమె తరఫు వారు కోర్టుకు నివేదించారు కూడా.
నిజానికి భార్య అయినంత మాత్రాన ఇలాంటి పైశాచికమైన వాంఛతో ఆమెను అనారోగ్య పరిస్థితుల్లో ఒత్తిడి చేసినందుకు కొన్ని సంవత్సరాలు, ఆ సమయంలో మద్యం తాగి అమానుషంగా ప్రవర్తించినందుకు మరికొన్ని సంవత్సరాలు, హత్య చేసినందుకు యావజ్జీవమూ.. అన్ని శిక్షలూ విడివిడిగా అనుభవించేలా శిక్ష పడితే బాగుంటుందని సాధారణంగా ఎవరికైనా అనిపిస్తుంది. కానీ హైకోర్టు వారికి మాత్రం.. భీమయ్య మద్యం తాగి పెళ్లాన్ని చంపేశాడు గనుక.. శిక్ష తగ్గించేద్దాం అనే సానుభూతి కలగడం విచిత్రం.

