మంత్రులకు ఎమ్మెల్యే వార్నింగ్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బీసీలను ఏకం చేసే పనిలో పడ్డారా? తనకు అడ్డుతగులుతున్న మంత్రులు, ఎంపీపై కసి తీర్చుకునేందుకు బలహీనవర్గాల వారిని ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? అవును. ఈ విషయం ఆయనే బహిరంగంగా మంత్రులతో చెప్పారు. తాను బలహీన వర్గానికిచెందిన వాడిని కావడంతో తనపై మంత్రులు, ఎంపీ వివక్ష చూపుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు. తన ప్రమేయం లేకుండానే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయని ఆయన మనస్తాపంచెందారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. మీడియా ముందే ఒకరిపై ఒకరు దూషించుకోవడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు, ఎంపీ జితేందర్ రెడ్డికి మధ్య అసలు పడటం లేదు. తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి ఎంపీ జితేందర్ రెడ్డి కారణమని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అలాగే ఎంపీకూడా శ్రీనివాస్ గౌడ్ పై గతంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీసీ కార్డుతో గౌడ్ నెట్టుకురాగలరా?
ఎంపీతో విభేదాలను అలా కొనసాగుతున్న సమయంలో తాజాగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిల మద్య కూడా వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. దీంతో మంత్రులు నియోజకవర్గంలో పర్యటించడానికే భయపడుతున్నారు. గతంలో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. దీనిని ఎంపీ జితేందర్ రెడ్డి తప్పుపట్టారు. తాను లేకుండా వాళ్లెలా ఆవిష్కరిస్తారని, ప్రొటోకాల పాటించాలన్న ఇంగితజ్ఞానం కూడా లేదని ఎంపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా శ్రీనివాస్ గౌడ్ లేకుండా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లిలు కలిసి ప్రతిపక్ష ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో కలిసి జడ్పీ అతిధి గృహాన్ని ప్రారంభించారు. దీనిపై శ్రీనివాస్ గౌడ్ అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. తన నియోజకవర్గంలో తాను లేకుండా ఎలా ప్రారంభిస్తారని తీవ్రస్థాయిలోప్రశ్నించారు. తాను బీసీని కావడం వల్లనే ఇలా చేస్తున్నారని, మీ నియోజకవర్గాల్లో బీసీలనంతా ఏకం చేసి వారిని చైతన్య వంతుల్ని చేస్తానని మంత్రుల్నే హెచ్చరించారట. ఈ విషయాన్ని మంత్రులిద్దరూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా గౌడ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తం మీద బీసీ కార్డు వాడతానని హెచ్చరికలు జారీ చేసిన శ్రీనివాస్ గౌడ్ పై అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
- Tags
- శ్రీనివాస్ గౌడ్

