భారత్ విజయానికి బ్రేక్...!

నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికానే విజయం వరించింది. వరుణుడి ఆటంకంతో పాటు చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు, బ్యాట్స్ మెన్ ధాటికి భారత్ తలవంచాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ గెలిస్తే వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఎప్పటిలాగానే రోహిత్ వికెట్ ను తొందరగానే కోల్పోవాల్సి వచ్చింది. శిఖర్ ధావన్, కోహ్లిలు కలిసి భారత్ కు శుభారంభాన్నిచ్చారు. శిఖర్ ధావన్ సెంచరీ, కోహ్లీ 75 పరుగులు చేసి భారత్ కు పరుగుల వరద పారించారు. యాభై ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. చివరలో ధోని 42 పరుగులు చేసి భారత్ కు భారీ స్కోర్ దక్కే లా చేశారు.
చెలరేగిన దక్షిణాఫ్రికా....
అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 28 ఓవర్లలో 202 పరుగులు చేయాలని నిర్ణయించారు. అయితే దక్షిణాఫ్రికా 25.3 ఓవర్లలోనే అననుకున్న లక్ష్యాన్ని చేరి భారత్ విజయానికి బ్రేకు వేసింది. స్పిన్ మాయాజాలం కూడా ఈ మైదానంలో పనిచేయలేదు. ఓపెనర్లు మార్క్ రమ్, ఆమ్లా జట్టుకు శుభారంభాన్నిచ్చారు. తర్వాత వీరిద్దరూ పెవిలియన్ దారి పట్టారు. ఆ తర్వాత వచ్చిన డుమిని, డివిలియర్స్ కూడా త్వరగా ఔట్ అవ్వడంతో భారత్ విజయం ఖాయమనుకున్నారు. అయితే ఆ తర్వాత బరిలోకి దిగిన మిల్లర్, క్లాసెన్ లు చెలరేగి ఆడి భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో దక్షిణాఫ్రికా నాలుగో వన్డేను సొంతం చేసుకుంది. ఆరు వన్డేల ఈ సిరీస్ లో భారత్ మూడు, దక్షిణాఫ్రికా ఒకటి గెలుచుకుంది. ఐదో వన్డే మంగళవారం జరగనుంది.

